IMD Rain ALERT : బంగాళాఖాతంలో అల్పపీడనం.. 25 నాటికి వాయుగుండం..! దక్షిణ కోస్తా, సీమ జిల్లాలకు భారీ వర్ష సూచన
AP Telangana Weather News : దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనం, వాయుగుండంగా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీలో నవంబర్ 26 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….
ఇవాళ దక్షిణ అండమాన్ సముద్రం మరియు దాని పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా నవంబర్ 23న అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 2 రోజుల్లో మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది. ఈ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది క్రమంగా దక్షిణకోస్తా మీదుగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందనీ.. లేదంటే.. దక్షిణ కోస్తాంధ్రలోనే తీరం దాటే సూచనలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది.
తాజా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, సీమ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబర్ 26, 26 తేదీల్లో భారీ వర్షాలు ఉంటాయని పేర్కొంది. తీర ప్రాంతం వెంట బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
మరోవైపు ఏపీలో ఇవాళ, రేపు, ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది. నవంబర్ 26వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. వాయుగుండం, అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉంటుంది.