బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం శుక్రవారం తెల్లవారుజామున గోలాప్‌పూర్-పారాదీప్ మధ్య తీరే దాటే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో నాలుగురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
రాబోయే కొద్ది రోజుల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలు, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఆదివారం వరకు ఇలాంటి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఇది తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడటానికి కారణమవుతుంది. గురువారం, శుక్రవారం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, హనుమకొండ, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.