శ్రీశైలం జలాశయానికి భారీగా వరద - 878 అడుగులకు నీటిమట్టం, గేట్లు ఎత్తే ఛాన్స్..!-heavy flood water inflow to srisailam reservoir latest updates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  శ్రీశైలం జలాశయానికి భారీగా వరద - 878 అడుగులకు నీటిమట్టం, గేట్లు ఎత్తే ఛాన్స్..!

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద - 878 అడుగులకు నీటిమట్టం, గేట్లు ఎత్తే ఛాన్స్..!

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,34,790 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 67,399 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది.

శ్రీశైలం ప్రాజెక్ట్ (ఫైల్ ఫొటో - 2024) (File Photo)

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల దాటికి కృష్ణా బేసిన్ లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే జూరాల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తటంతో… శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీస్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ రేపోమాపో పూర్తిస్థాయి నిండిపోయే అవకాశం ఉంది. మరోవైపు క్రస్ట్ గేట్లను ఎత్తే విషయంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

శ్రీశైలంలో నీటిమట్టం వివరాలు

ఇవాళ(జూలై 6 ) ఉదయం 7:43 గంటల రిపోర్ట్ ప్రకారం… ప్రాజెక్ట్ కు చేరుతున్న ఇన్ ఫ్లో 1,34,790 క్యూసెక్కులుగా ఉంది. 67,399 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 878.40 అడుగులకు చేరింది. మరికొన్ని అడుగులు దాటితే… ప్రాజెక్ట్ నిండుకుండలా మారనుంది. ఆ తర్వాత గేట్లు ఎత్తే అవకాశం ఉంది. రేపోమాపో గేట్లు ఎత్తే విషయంపై ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తోంది.

ఎగువ రాష్ట్రాల్లోనే కాకుండా ఏపీలోనూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో…. శ్రీశైలం ప్రాజెక్ట్ ఈసారి ముందుగానే నిండటం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం… వచ్చే రెండు రోజుల్లో క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

నాగాార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద…

మరోవైపు నాగార్జున సాగర్ లో పరిస్థితి చూస్తే ఇవాళ ఉదయం రిపోర్ట్ ప్రకారం నీటిమట్టం 525.8 గా ఉంది.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంటుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 160.06 టీఎంసీలు నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 56,674 క్యూసెకులుగా కాగా… ఔట్ ఫ్లో 8,741 క్యూసెకులుగా ఉంది.

ఇక పులిచింతల ప్రాజెక్టు వద్ద పరిస్థితి చూస్తే…. 154.95 అడుగుల నీటిమట్టం ఉంది. 20.13 టీఎంసీల నీటి నిల్వ ఉంది.ఇన్ ఫ్లో నిల్ ఉండగా… ఔట్ ఫ్లో 5,000 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తితే పులిచింతలకు భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి స్వల్పంగా వరద నీరు చేరుతోంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.