ఎండలు బాబోయ్.. ఎండలంటూ ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సోమవారం 98 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని, మరో 11 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
తీవ్ర వడగాడ్పులు వీచే మండలాల్లో కాకినాడ-3 (జగ్గంపేట-42.5, కిర్లంపూడి-42.3, పెద్దాపురం-42.2), అంబేద్కర్ కోనసీమ-7 (అయినవిల్లి-42.9, అంబాజీపేట-42.6, కపిలేశ్వరపురం-42.6, కొత్తపేట-42.4, ముమ్మిడివరం-42.3, పమర్రు-43.1, రావులపాలెం-42.3), తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం (42.9 శాతం ఉష్టోగ్రత) మండలంలో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని కూర్మనాథ్ వివరించారు. అల్లూరు సీతారామ రాజు-5, కాకినాడ-9, కోనసీమ-8, తూర్పుగోదావరి-18, పశ్చిమ గోదావరి-7, ఏలూరు-8, కృష్ణా-10, గుంటూరు-13, బాపట్ల-9, పల్నాడు-5, ప్రకాశం-6 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని చెప్పారు.
ఆదివారం 54 మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 30 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 67 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శ్రీకాకుళం-7, విజయనగరం-11, పార్వతీపురం మన్యం-10, ఏలూరు-1, ఎన్టీఆర్-1 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. శ్రీకాకుళం-2, విజయనగరం-7, పార్వతీపురం మన్యం-2, అల్లూరి సీతారామరాజు-3, తూర్పుగోదావరి-1, పశ్చిమ గోదావరి-2, ఏలూరు-10, కృష్ణా- 11, ఎన్టీఆర్-5, గుంటూరు -16, బాపట్ల-5, పల్నాడు-3 మండలాల్లో వడగాడ్పులు వీచాయి.
సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని.. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు.
కోస్తాంధ్ర, యానాం మధ్య ప్రాంతాలు, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ఫలితంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు కోస్తాంధ్ర, యానాంలో రాగల రెండు రోజుల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తరువాత మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది. రాయలసీమలో రాగల రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పులేదని, తరువాత మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం