ChandraBabu CID Cases: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, విచారణ ఈ నెల 21కు వాయిదా
ChandraBabu CID Cases: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసులపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ 21కు వాయిదా పడింది. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
ChandraBabu CID Cases: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరుగుతోంది. బాబుపై నమోదు చేసిన కేసులకు విచారణ అర్హత లేదని సుప్రీం కోర్టు న్యాయవాది హరీష్ సాల్వే వాదించారు. ఈ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు. గత వారం దాఖలైనప పిటిషన్ విచారణను నేటికి వాయిదా వేశారు. మంగళవారం చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదిస్తున్నారు. ప్రభుత్వం తరపున ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు.
మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు 21వ తేదీకి వాయిదా పడింది.
చంద్రబాబు క్వాష్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నమోదైన కేసుల్ని కొట్టేయాలని చంద్రబాబు కోరగా, కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోరుతోంది. రిమాండ్ రిపోర్ట్ సస్పెన్షన్, క్వాష్ పిటిషన్లపై విచారణ 89వ ఐటెంలుగా ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇది 58వ ఐటెంగా ఉంది. ఇన్నర్ రింగ్ వ్యవహారంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కోరడంతో కేసు విచారణను 21వ తేదీకి వాయిదా వేశారు.
ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో పలు అంశాలను ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబును అరెస్ట్ చేసే సమయానికి ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేదని కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ తేజ్‌మాల్ చౌదరి, అర్ణబ్ గోస్వామి కేసులను సాల్వే హైకోర్టులో ప్రస్తావించారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌పై గతంలో జరిగిన దర్యాప్తుపై మెమో మాత్రమే వేశారన్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ కింద తగిన అనుమతులు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. చంద్రబాబుపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ చట్టవిరుద్ధమైనదని వాదించారు. గతంలో వచ్చిన తీర్పులను అడ్వకేట్ జనరల్ తప్పుగా అన్వయించారన్నారు. సెక్షన్ 17ఏ పూర్తి వివరాలు తెలిసి ఉండీ తప్పనిసరి అనుమతులు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. కేసు పెట్టేందుకు మూలమైన సమయం దృష్టిలో పెట్టుకొని సెక్షన్ 17ఏ వర్తిస్తుందన్నారు. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చంద్రబాబు తరఫున హైకోర్టులో వాదనలు వినిపించారు.