HCL: ఏపీలో భారీ విస్తరణకు హెచ్‌సీఎల్ సన్నాహాలు.. మరో 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు
HCL: ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ హెచ్‌సీఎల్ ఏపీలో తమ కార్యకలాపాల విస్తరణకు సిద్ధమైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్‌సీఎల్.. ప్రస్తుతం 4500 మందికి ఉద్యోగాలు కల్పించింది. తాజాగా.. రాష్ట్రంలో భారీ ఎత్తున విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
హెచ్‌సీఎల్ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లి నివాసంలో ఐటి మంత్రి నారా లోకేష్‌తో సమావేశమయ్యారు. ఏపీలో విస్తరణ ద్వారా మరో 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఫేజ్ 2 లో భాగంగా నూతన కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టి.. మరో పది వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఐటిలో ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న ట్రెండ్స్‌కు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా.. పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సెన్సస , స్కిల్ డెవెలప్మెంట్‌లో తాము కూడా భాగస్వామ్యం అవుతామని హెచ్‌సీఎల్ ప్రతినిధులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విస్తరణకు కావాల్సిన కొన్ని అనుమతులు, గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు విడుదల చేయాల్సిందిగా హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రి లోకేష్‌ను కోరారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక రాష్ట్రాలు పోటీపడగ.., తాను స్వయంగా వెళ్లి హెచ్‌సీఎల్ ఛైర్ పర్సన్ శివ్ నాడార్‌తో మాట్లాడి గన్నవరంలో క్యాంపస్ ఏర్పాటుకు ఒప్పించానని లోకేష్ చెప్పారు. రికార్డు టైంలో అనుమతులు, భూ కేటాయింపులు చేసి.. యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు ప్రారంభించేలా చేయడం తనకు మంచి అనుభూతినిచ్చిందని అన్నారు. గన్నవరం వైపు వెళ్లిన ప్రతిసారీ యువత 4500 మందికి ఉద్యోగాలు కల్పించామన్న సంతృప్తి, సంతోషం కలిగేవని చెప్పారు.
ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ అసమర్ధత కారణంగా సంస్థ కార్యకలాపాలు ముందుకు సాగలేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 20 వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన సంస్థ.. కేవలం 4500 మంది వద్దనే ఆగిపోయిందన్నారు. పూర్తి స్థాయి అనుమతులు, రాయితీలు ఇవ్వకుండా నిలిపివేసి ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని.. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు.
హెచ్‌సీఎల్ కంపెనీ పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాల విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తామని లోకష్ భరోసా ఇచ్చారు. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను త్వరితగతిన క్లియర్ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన రాయితీలను విడతల వారీగా చెల్లిస్తామన్నారు. మరో 15,500 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయండి, అందుకు అవసరమైన పూర్తి సహకారం తాము అందిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఐటిలో వస్తున్న అధునాతన మార్పులకు అనుగుణంగా.. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నందుకు హెచ్‌సీఎల్ సంస్థ ప్రతినిధులను అభినందించారు.