Floods In Rayalaseema : 100 ఏళ్ల తర్వాత పొంగిపొర్లుతున్న వేదవతి నది
Andhra Pradesh Floods : అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల గుండా ప్రవహించే వేదవతి నదికి వరద నీరు భారీగా వస్తోంది.
గతంలో ఎప్పుడూ లేనంతగా.. వేదవతి నది పొంగిపొర్లుతోంది. వందేళ్లలో ఎన్నడూ లేనంతగా వరద నీరు వస్తోంది. ఈ నదిపై కర్ణాటక ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా దశాబ్దాలుగా ప్రవాహం లేకుండా అయింది. కొన్నిరోజుల ముందు చూసుకుంటే.. నది ఆనవాళ్లు కూడా మారిపోయే పరిస్థితి కనిపించింది.
1982, 1996లో కొద్దిగా ప్రవాహం వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. అనంతరం.. నదిలో నీరు అనేదే కనిపించలేదు. ఇప్పుడు భారీ వర్షాలు పడుతుండటంతో వేదవతి నది ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతి కారణంగా వేదవతిపై నిర్మించిన భైరవానితిప్ప ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ఎన్నడూ లేని విధంగా 66 వేల క్యూసెక్కుల నీటిని వదలడం ఇదే మెుదటిసారి. వరదతో నదీ పరివాహక ప్రాంతాల్లో వేసిన పంట కొట్టుకుపోయింది.
అనంతపురం జిల్లాలో గత రెండు దశాబ్దాలుగా కణేకల్ మండలంలోని ఇసుక తిన్నెలతో సహా హగరి నదీగర్భం ఎడారిగా మారింది. ఈ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు వస్తున్న వరదలతో పొంగిపొర్లుతున్న నదిని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
డ్యాం నుంచి నదిలోకి ఔట్‌ఫ్లో విడుదల చేయడంపై రైతులు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సకాలంలో అప్రమత్తంగా లేకపోవడం వల్ల పెద్దఎత్తున వరదలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇటీవలి కాలంలో తొలిసారిగా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
వేదావతి హగరి నది పడమటి కనుమలలో పుట్టి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవాహం కొనసాగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో హగరి అని కూడా పిలుస్తుంటారు. సహ్యాద్రి పర్వత శ్రేణి తూర్పు భాగం నుంచి వస్తున్న వేద, అవతి నదులు తూర్పు వైపు ప్రవహించి 'పూర' వద్ద కలసి వేదవతి నదిగా మారుతుంది. ఈ నది ఒడ్డున ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి.
భారీ వర్షాలతో మరోవైపు తుంగభద్ర, కృష్ణా నదీ ప్రాంతాల్లో నిరంతరంగా ప్రవహిస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం 3.39 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, నదిలోకి 3.44 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్‌కు వరదలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ వైపు 35 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లోను పరిమితం చేశారు.