GVMC Elections: వైసీపీ చేయి జారనున్న జీవీఎంసీ మేయర్‌ పీఠం! స్టాండింగ్‌ కమిటీల్లో కూటమి జోరు-gvmc mayors chair is going to slip to ycp alliance is strong in standing committees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gvmc Elections: వైసీపీ చేయి జారనున్న జీవీఎంసీ మేయర్‌ పీఠం! స్టాండింగ్‌ కమిటీల్లో కూటమి జోరు

GVMC Elections: వైసీపీ చేయి జారనున్న జీవీఎంసీ మేయర్‌ పీఠం! స్టాండింగ్‌ కమిటీల్లో కూటమి జోరు

Sarath chandra.B HT Telugu
Aug 08, 2024 07:03 AM IST

GVMC Elections: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్న ఎన్డీఏ కూటమి ఇప్పుడు స్థానిక సంస్థల్ని తమ ఖాతాలో వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్‌ విశాఖ మేయర్‌ పీఠంపై కూటమి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించింది.

జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల తర్వాత సంబరాలు
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల తర్వాత సంబరాలు

GVMC Elections: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ ఎదురు దెబ్బ తగిలింది. నిన్న మొన్నటి వరకు విశాఖపట్నాన్ని తమ గుప్పెట్లో ఉంచుకున్న వైఎస్సార్సీపీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మరో షాక్ తగిలింది. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పోరేషన్ స్టాండింగ్ కమిటీల ఎన్నికల్లో 10 స్థానాలను ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్వయంగా పర్యవేక్షించినా ఫలితం లేకుండా పోయింది.

స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ నాయకులు క్యాంపును కూడా నిర్వహించారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖ మేయర్ పీఠం వైసీపీకి దక్కింది. తాజాగా జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో అనూహ్యంగా కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఇటీవల వైసీపీ నుంచి పలువురు కార్పొరేటర్లు జనసేనలో చేరడం తెలిసిందే.

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్ని కలు జీవీఎంసీ కార్యాలయంలో బుధవారం జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల ఓటింగ్ నిర్వహించారు. మొత్తం పది స్థానాలకు వైకాపా, తెదేపా అభ్య ర్థులు పోటీపడగా 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఒక్కొక్కరికి స్టాండింగ్‌ కమిటీల్లో పది ఓట్లు వేసే అవకాశం ఉండటంతో మొత్తం 960 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపులో కూటమి తరపున పోటీలో నిలిచిన పది మంది టీడీపీ కార్పొరేటర్లు విజయం సాధించారు. దీంతో స్టాండింగ్ కమిటీలో అన్ని స్థానాలూ కూటమి వశమయ్యాయి. గెలిచిన వారిలో విల్లూరి భాస్కరరా వుకు 66 ఓట్లు, గొలగాని వీరారావు- 65, పిసిని వరాహ లక్ష్మీ నరసింహం- 65, గల్లా పోలిపల్లి-64, బొమ్మిడి రమణ- 64, బల్ల శ్రీనివాసరావు- 60, శరగడం రాజశేఖర్- 60, నొల్లి నూకరత్న- 58, లక్ష్మీబాయి పులి-56, పిళ్లా మంగమ్మ 54 ఓట్లతో మొదటి ప్రాధాన్యత దక్కించుకున్నారు.

స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలకు ముందు వైసీపీకి 47మంది కార్పొరేటర్లు ఉండగా పోలింగ్ సమయానికి అనూహ్య పరిణామలు జరిగాయి. నలుగురు కార్పొరేటర్లు వైసీపీ శిబిరం నుంచి తప్పుకున్నారు.దీంతో కూటమి బలం 53కు చేరింది. అదు పబమవలొ స్టాండింగ్ కమిటీలో గెలిచిన టీడీపీ అభ్యర్థుల్లో చాలామందికి 65కు పైగా ఓట్లు రావడంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు గుర్తించారు. వైసీపీని ఓడించడంలో టీడీపీ స్కెచ్ సక్సెస్ అయ్యింది.

స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించడంతో జీవీఎంసీ కార్యాలయం వద్ద ఎన్డీఏ నేతలు సంబరాలు చేసుకున్నారు. గెలుపొందిన వారిని కూటమి ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, తెదేపా జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ సన్మానించారు. భవిష్యత్తులో మేయర్ స్థానాన్ని కూడా కూటమి కైవసం చేసుకుంటుందని విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రకటించారు.

ఓట్ల లెక్కింపు సమ యంలో అక్రమాలు చోటు జరిగాయంటూ వైసీపీ కార్పొరేటర్లు, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీను నిరసన వ్యక్తం చేశారు.బ్యాలెట్ పేపర్లపైస్వస్తిక్ మార్క్ తప్ప ఎలాంటి గుర్తులు ఉండకూడదనే నిబంధన ఉన్నా కొన్ని బ్యాలట్లపై పెన్సిల్ గుర్తులున్నాయనిఆరోపించారు. అనర్హత ఓట్లు తీనేసి మిగిలినవి లెక్కిం చాలంటూ డిమాండ్ చేశారు. పోలీసు బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు పూర్తి చేసి గెలిచిన సభ్యులను కమిషనర్ సంపత్ ప్రకటించారు.

సొంత పార్టీ కార్పొరేటర్‌లలో ఉన్న వ్యతిరేకత కూడా స్పష్టంగా కనిపించిందని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అన్నారు. ఈ వ్యతిరేకత గురించి గతంలో చెప్పానని, ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపించిందని, మా మీద ప్రజలు కార్పొరేటర్లు ఉంచిన నమ్మకాన్ని కచ్చితంగా అభివృద్ధి దిశగా తీసుకువెళ్తామన్నారు. భవిష్యత్తులో మేయర్ స్థానం కూడా ఇదే దిశగా కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి విజయంతో వైసిపి నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు . స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది విజయం సాధించి కూటమి విజయంలో కీలక పాత్ర వహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.