Guntur Car Washed Away : వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు, కాలువలు, పొంగుతున్నాయి. గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతయ్యారు. నంబూరులోని ఓ స్కూల్ లో ఉప్పలపాడుకు చెందిన రాఘవేంద్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భారీ వర్షాలతో శనివారం స్కూల్ కు సెలవు ప్రకటించారు. దీంతో ఆ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులను తీసుకొని రాఘవేంద్ర ఇంటికి బయల్దేరారు. ఉప్పలపాడు సమీపంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులో ఆగకుండా కారు డ్రైవ్ చేయడంతో....వరద ఉద్ధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాఘవేంద్రతో పాటు కారులోని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. స్థానికులు కారును వాగులోంచి లాగి, మృతదేహాలను బయటకు తీశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుంటూరు ఆటోనగర్, పెద్దకాకాని పోలీస్ స్టేషన్ సమీపంలో రహదారులు జలమయం అయ్యాయి. టోల్‍గేట్ వద్ద ప్రధాన రహదారిపై మోకాలి లోతులో వరద నీరు చేరడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. టోల్ ప్లాజా ప్రాంతం వరద నీటితో జలాశయాన్ని తలపిస్తుంది. జాతీయ రహదారిపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అవసరం లేకుండా ప్రజలు రోడ్డుపైకి రావద్దని ఇళ్లలోనే ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షాలకు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నిడమానూరు-పోరంకి ప్రధాన రహదారి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విజయవాడ, గుంటూరులలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని గుంటూరు జిల్లా కలెక్టరేట్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు తమ సమస్యను కాల్ సెంటర్ కు తెలియజేసి తక్షణ సహాయం పొందవచ్చని అధికారులు సూచించారు.
భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందడంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అధికారుల సూచనలను ప్రజలు తప్పక పాటించాలని కోరారు.
సంబంధిత కథనం