Guntur Crime : ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం, నిందితుడిపై పోక్సో కేసు నమోదు
Guntur Crime : గుంటూరు జిల్లా ఏడేళ్ల చిన్నారిపై వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు అయ్యింది.

Guntur Crime : గుంటూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు. అయితే బాలిక కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసి నిందితుడికి దేహశుద్ధి చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అలాగే అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా కొల్లూరు మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొల్లూరు మండలానికి చెందిన ఏడేళ్ల బాలిక స్థానికంగా చదువుతోంది. జనవరి 29న బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిన సమయంలో ఇంటి ముందు బాలిక ఆడుకుంటుంది. బాలిక ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న 49 ఏళ్ల ఉదరగడి లక్ష్మయ్య బాలిక ఒంటిరిగా ఉండటాన్ని గమనించాడు.
బాలిక దగ్గరకు వెళ్లి మాయ మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఇంటి తలుపులు వేసి బాలికతో లైంగికదాడికి ప్రయత్నించాడు. దీంతో బాలిక భయపడి అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి పారిపోయింది. బాలిక భయపడి తల్లిదండ్రులకు చెప్పకుండా తనలోనే ఆందోళనకు గురయింది. అయితే ఈనెల 5 తేదీన బాలిక ఇంటి ముందు ఉన్న సమయంలో లైంగిక దాడి యత్నానికి పాల్పడిన లక్ష్మయ్య అటుగా వెళ్తుండగా...అతనని చూసిన బాలిక భయపడి పరిగెత్తుకుంటూ తన మేనత్త వద్దకు చేరుకుంది. దీంతో మేనత్త ఏం జరిగిందని ఆరా తీసింది.
జరిగి విషయం మేనత్తతో చెప్పిన బాలిక
అప్పుడు బాలిక లక్ష్మయ్య తనతో ప్రవర్తించిన తీరు గురించి వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు కూలి పనుల నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత వారికి జరిగిన విషయాన్ని మేనత్త తెలిపింది. వెంటనే బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు నిందితుడి ఇంటికి వెళ్లి పట్టుకొని దేహశుద్ధి చేశారు.
అనంతరం శనివారం కొల్లూరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. రేపల్లె డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, ఎస్ఐ జి. ఏడుకొండలు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లక్ష్మయ్యను ఆదివారం కొల్లూరు మండలంలోని మొసలిపాడు వద్ద అదుపులోకి తీసుకున్నారు.
ఎనిమిదేళ్ల బాలిక పట్ల అసభ్యకర ప్రవర్తన...పోక్సో కేసు నమోదు
ఎనిమిదేళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు అయింది. ఈ ఘటన విజయనగరం జిల్లా తెర్లాం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. తెర్లాంలోని ఒక కాలనీకి చెందిన బాలిక శనివారం రాత్రి తినుబండారాలు కొనుగోలు చేసుకునేందుకు షాప్‌కి వెళ్లింది. షాప్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన కంకణాల కిరణ్ అనే వ్యక్తి ఆ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.
దీంతో బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెళ్లి కిరణ్‌ను నిలదీశారు. వెంటనే తెర్లాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఎస్ఐ సాగర్ బాబు స్పందిస్తూ నిందితుడిపై పోక్సో కేసు నమోదు అయిందని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం