Guntur Ration Dealer Jobs : గుంటూరు జిల్లాలో 152 రేషన్ డీలర్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Guntur Ration Dealer Jobs : గుంటూరు జిల్లాలో 152 రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో, తహశీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి.
Guntur Ration Dealer Jobs : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించి ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. శాశ్వత ప్రాతిపదికన గుంటూరు జిల్లాలో 152 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తులు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో, తహశీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను తెనాలి సబ్ కలెక్టర్, తెనాలి రెవెన్యూ డివిజన్ అధికారులకు ఆఫ్‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు దాఖలకు డిసెంబర్ 30 ఆఖరు తేదీగా నిర్ణయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ద్వారా ఎంపిక ఉంటుంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
ఎన్ని పోస్టులు?
గుంటూరు జిల్లాలో ఒక్క తెనాలి రెవెన్యూ డివిజన్‌లో కాకుమాను, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 152 రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సబ్ కలెక్టర్ వి.సంజనాసింహ తెలిపారు. ఇందులో పాత రేషన్ షాపుల్లో ఉన్న 81 షాపులు, కొత్తగా ఏర్పాటు చేసిన 71 రేషన్ షాపుల్లో డీలర్ల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.
విద్యా అర్హత...వయో పరిమితి
రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ విద్యా అర్హతను నిర్ణయించారు. అలాగే వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్డ్వ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిర్ణయించిన మినహాయింపు ఉంటుంది. డీలర్ పోస్టుకు, దుకాణానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు సొంత గ్రామానికి చెందిన వారై ఉండాలి. ఎటువంటి పోలీసు కేసులు ఉండకూడదు. చదువుతున్నవారు, విద్యా వలంటీర్లు, ఏఎన్ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్నవారు, ఆశ కార్యక్తలు దరఖాస్తు దాఖలకు అనర్హులు. ఆర్థిక స్థోమత వివరాలు తెలుపుతూ స్వీయ డిక్లరేషన్, సర్టిఫికేట్ సమర్పించాలి. దరఖాస్తుదారుల కుంటుబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులై ఉండరాదు.
అభ్యర్థుల ఎంపిక షెడ్యూల్
అభ్యర్థులు డిసెంబర్ 30 తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 తేదీన దరఖాస్తుల పరిశీలించనున్నారు. అదే రోజు అర్హులైన వారి జాబితా ప్రకటిస్తారు. ఎంపికైన వారికి జనవరి 5న రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ జనవరి 3న జారీ చేస్తారు. జనవరి 6న రాత పరీక్షల ఫలితాలు వెల్లడిస్తారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా ప్రచురిస్తారు. రాత పరీక్షలో ఆయా ప్రాంతాలకు చెందిన అత్యధిక మార్కులు సాధించిన ఐదుగురు అభ్యర్థులకు జనవరి 7న తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జనవరి 8న ఎంపికైన వారి తుది జాబితాను విడుదల చేస్తారు. ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికేట్లతో హాజరుకావాలి.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ
రాత పరీక్ష, ఇంటర్వ్యూకు వేర్వేరుగా మార్కులు ఉంటాయి. మొత్తం 100 మర్కులు ఉండగా, అందులో రాత పరీక్షకు 80 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి. రాత పరీక్ష నుంచి ఇంటర్వ్యూకు 1:5 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఇలా చేసుకోండి
తెనాలి రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి డీలర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆర్డీవో కార్యాలయం, సంబందిత తాహశీల్దారు కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు, గ్రామా సచివాలయం నోటీసు బోర్డు, సంబందిత రేషన్ షాపుల వద్ద ప్రచురిస్తారు. పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తులను ఆయా మండలాల తహశీల్దారు కార్యాలయాల్లోనూ, లేదా ఆర్డీవో కార్యాలయంలోనూ నుంచి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు ఫాంను నేరుగా గాని, లేదా పోస్టు ద్వారా గాని సంబంధిత తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికేట్లు జత చేయడం తప్పని సరి. ఇతర వివరాల కోసం ఆయా తాహశీల్దారు కార్యాలయాలను సంప్రదించాలి.
దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు
1. ఇంటర్మీడియట్, పదో తరగతి ఉత్తీర్ణత సర్టిపికేట్లు
2,. వయస్సు ధ్రువీకరణ పత్రం
3. నివాస ధ్రువీకరణ పత్రం (ఓటరు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైనా పర్వాలేదు)
4. మూడు పాస్‌పోర్ట్ సైజ్ పోటోలు
5. కుల ధ్రువీకరణ పత్రం
6. నిరుద్యోగిగా ఉన్నట్లు స్వీయ ధ్రువీకరణ పత్రం
7. దివ్యాంగుల కేటగిరికి చెందిన వారైతే సంబంధిత సర్టిఫికేట్లు జత చేయాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం