ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టు పెట్టిన యువకుడిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన అల్లు అర్జున్ ఫ్యాన్ రఘు అలియాస్ పుష్పరాజ్‌ను అరెస్టు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారు. నిందితుడిని బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.
అల్లు అర్జున్ ఫ్యాన్ అయిన రఘు హీరోల అభిమానుల సోషల్ మీడియా జరిన ఫ్యాన్ వార్ లో భాగంగానే మార్క్ శంకర్ పై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేశారని ఎస్పీ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన సాంబశివరావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రఘును అరెస్టు చేశారు. ఓ మహిళపైనా రఘు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
'నిందితుడు రఘు 5 సెల్ ఫోన్స్ వినియోగిస్తున్నాడు. 14 మెయిల్ ఐడీలను వాడి సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఖాతాలు తెరిచాడు. రఘు చేసిన పోస్టులను పరిశీలించగా...ఎక్కువగా మహిళలను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నాడు. మహిళల గౌరవానికి భంగం కలిగించడం, రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టినందుకు రఘుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం.
కర్నూలు జిల్లా గూడూరులో నిందితుడిని అరెస్టు చేశాం. సోషల్ మీడియాను మంచికి వినియోగించాలని కానీ నెగిటివ్ వాడవచ్చు. గత ఏడు, ఎనిమిది నెలలుగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, రెచ్చగొట్టే ధోరణి... ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాము. ఇందులో భాగంగా రఘు పోస్టులపై కేసు కట్టాము. నిందితుడిని కోర్టులు ప్రొడ్యూస్ చేస్తాం' అని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
"09.04.2025 తేదీన రాత్రి 09:00 గంటలకు ప్రతిపాడు గ్రామానికి ఎం సాంబశివరావు అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాను పరిశీలిస్తూ ఉండగా "AA Ne naa loakm" అనే అకౌంట్ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుమారుడు మార్క్ శంకర్ వారిద్దరూ కలసి ఉన్న ఫోటోను ఒక వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా నందు వ్యక్తిగత దూషణలకు పాల్పడే విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలను జోడించి పోస్టు చేయడం చూసి వెంటనే ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ పోస్ట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం.
ఈ దర్యాప్తులో కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన పుట్టపాశం.రఘు(21) ఈ పోస్ట్ పెట్టినట్లు సాంకేతిక పరిజ్ఞానంతో కనిపెట్టాం. అతనిని పుష్పరాజ్ అని కూడా పిలుస్తారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించేవారు స్వీయ నియంతృత్వం కలిగి, మంచి పనుల కోసం ఉపయోగించాలే తప్ప ఇతరులను దూషించడానికి, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టడానికి ఉపయోగించరాదు. ఆ విధంగా చేస్తే వారిపై చట్టపరంగా కట్టిన చర్యలు తీసుకుంటాము" -ఎస్పీ సతీష్ కుమార్
సంబంధిత కథనం