Guntur : కేసుల నుంచి తప్పించుకోవడానికి.. బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు.. అంతలోనే ఊహించని ట్విస్ట్
Guntur : అతనో రౌడీ షీటర్. ఎన్నో హత్య కేసుల్లో నిందితుడు. ఎన్నోసార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. ప్రాణభయంతో పారిపోయాడు. కానీ.. కేసులు వెంటాడుతున్నాయి. దీంతో ఓ కానిస్టేబుల్ సాయంతో కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ కథ అడ్డం తిరిగింది. పోలీసులు పట్టుకొని లోపలేశారు.
రౌడీషీటర్, పలు హత్య కేసుల్లో నిందితుడు ప్రాణభయంతో పారిపోయాడు. కేసుల నుంచి తప్పించుకోవాడనికి మరణించినట్టుగా డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. ఇందుకు ఓ కోర్టు కానిస్టేబుల్ సహకరించాడు. ఇక అంతా సేఫ్ అనుకున్న సమయంలో.. విషయం బయటపడింది. ఆ రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
వలస వచ్చి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల మండలం కరాలపాడుకు చెందిన పాదర్తి రమేష్ 20 ఏళ్ల కిందట గుంటూరుకు వలస వచ్చాడు. ఓ అపార్ట్‌మెంట్లలో వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలోనే అతని పెద్దమ్మ కుమారుడు, రౌడీషీటర్ నల్లపాటి శివయ్యతో కలిసి నేరాలు చేశాడు. శివయ్యను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన మల్లాది శ్రీనును 2009లో రమేష్‌తోపాటు మరికొంతమంది కలిసి హత్య చేశారు. 2010లో పాదర్తి రమేష్ తమ్ముడిని కొట్టిన వ్యక్తిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే శివయ్య, రమేష్ మధ్య వివాదాలు తలెత్తాయి.
సినిమా స్టైల్‌లో..
ఈ నేపథ్యంలో తనను హత్య చేసేందుకు అమరయ్య అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నట్టు తెలుసుకుని.. అతడిని 2011లో హతమార్చాడు. 2014లో శివయ్యను నాటు బాంబులతో హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. కానీ.. పోలీసులు పట్టుకున్నారు. జైలు నుంచి బయటకొచ్చాక 2016లో శివయ్య హత్యకు మరోసారి ప్లాన్ వేశాడు. అందుకు డబ్బు అవసరమై రాఘవేంద్రరావు అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడు.
ప్రాణ భయంతో..
2017లో గంజాయి కేసులో రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే.. తనపై ఉన్న కేసుల్లో కోర్టుకు హాజరైతే శివయ్య అనుచరులు హత్య చేస్తారన్న భయంతో.. తొలుత హైదరాబాద్ వెళ్లిపోయాడు. అక్కడి నుంచి మళ్లీ బాపట్లకు వచ్చి అక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. కరోనా సమయంలో కాంగ్రెస్ నేత, కార్పొరేటర్ పాదర్తి రమేష్ గాంధీ మృతి చెందారు. ఆయనపై అరండల్‌పేట స్టేషన్లో కేసులున్నాయి.
డెత్ సర్టిఫికెట్‌తో..
కేసులున్న వ్యక్తి మృతి చెందితే.. డెత్ సర్టిఫికెట్ ఆధారంగా వాటిని రద్దు చేస్తారు. దీన్ని అవకాశంగా మలచుకున్న రమేష్.. పట్టాభిపురం స్టేషన్లో కోర్టు కానిస్టేబుల్‌గా పని చేసిన రాజు కలిసి.. రమేష్‌గాంధీ మరణ ధ్రువీకరణపత్రంతో రౌడీషీటర్ పాదర్తి రమేష్ మృతి చెందినట్టు ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. ఎస్సై సంతకం ఫోర్జరీ చేశారు. కేసులు రద్దు చేయించేందుకు ప్రయత్నించారు.
కానీ తాజాగా ఈ మోసం బయటపడింది. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు కానిస్టేబుల్ రాజుపై చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. రౌడీషీటర్ రమేష్‌పైనా కేసు నమోదు చేశారు. తాజాగా అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ వ్యవహారం ఇప్పుడు గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.