Case Filed On Jagan : గుంటూరు మిర్చి యార్డు పర్యటన, మాజీ సీఎం జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు
Case Filed On Jagan : మిర్చి రైతులకు గిట్టుబాటు ధరను డిమాండ్ చేస్తూ మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారు. ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉందని చెప్పినా నిబంధనలు ఉల్లంఘించారని వైఎస్ జగన్ సహా 8 మందిపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

Case Filed On Jagan : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ వైఎస్ జగన్ వైసీపీ నేతలు మిర్చి యార్డులో కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నతేలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నె్ల్లి తదితరులపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
జగన్ పర్యటన సమయంలో మిర్చియార్డు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు రోడ్డుపై వాహనాలను నిలిపివేయడంతో మిర్చి యార్డుకు సరకు తెచ్చే వాహనాలు భారీగా రోడ్డుపై నిలిచిపోయి రైతులు అవస్థలు పడ్డారు. అయితే పోలీసులు జగన్ కు భద్రత కల్పించలేదని, ట్రాఫిక్ క్లియర్ లేయలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వైసీపీ ఆరోపణలు ఇలా
"సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వస్తే జనం రారు. కానీ జగన్ వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు. 40% ఓట్ షేర్ ను ఒకే ఒక్కడుగా వైఎస్ జగన్ తెచ్చుకున్నారు. అంత ప్రజాదరణ కలిగిన మాజీ ముఖ్యమంత్రికి Z+ సెక్యూరిటీ ఉన్నా, లోకేశ్ మాట విని పోలీసులు భద్రత ఇవ్వలేదు"-అంబటి రాంబాబు, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు
"వైఎస్ జగన్ కోసం వచ్చిన జనాన్ని చూసి కడుపు మండి వికృతరాతలు రాస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచీ చిల్లర రాజకీయమే తప్ప శక్తి వంతమైన రాజకీయం చేయడం లేదు. వైఎస్ఆర్ సీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టులు చేస్తూ పాలనను గాలికొదిలేశారు. మిర్చిరైతుల కోసం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్‌కు వస్తే కనీసం ఒక్క పోలీసును కూడా భద్రతకు పంపలేదు. గతంలో జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీటింగ్ లు పెట్టగలిగేవారా?"-నందిగం సురేష్, మాజీ ఎంపీ
"చంద్రబాబు పాలనలో వలస పోయినవాళ్లం. జగన్ పాలనలో తిరిగి వచ్చాం అని రైతులు చెబుతున్నారు. గత 9 నెలల పాలనలో రైతులు తమ సమస్యలను, కన్నీళ్లను జగనన్నకు చెప్పుకుంటున్నారు. రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సిన పోలీసులు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారు. ప్రతిపక్ష నేత భద్రతా వైఫల్యంపై పోలీస్ అధికారులు సమాధానం చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది"-విడదల రజిని, మాజీ మంత్రి
సంబంధిత కథనం