AP Phone Tapping : ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కలకలం, సజ్జల డైరెక్షన్ లోనే- మాజీ వైసీపీ నేత సంచలన ఆరోపణలు
AP Phone Tapping : తెలంగాణలో తరహాలో ఏపీలో కూడా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు.
AP Phone Tapping : ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీంతో తెలంగాణలో లాగే ఏపీలో కూడా ప్రభుత్వం మారిన వెంటనే ఆరోపణలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, మాజీ వైసీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బాంబు పేల్చారు. వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ఏపీలోని ప్రముఖ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధుల ఫోన్లు, వ్యక్తిగత సమాచారాన్ని రికార్డు చేశారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
వైసీపీ రెబల్స్ ట్యాపింగ్ ఆరోపణలు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కూడా గతంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. వారిద్దరూ వైసీపీపై తిరుగుబాటు ప్రకటించినప్పడు ఇవే ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. అయితే డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎన్నికలకు ముందు వరకు వైసీపీలోనే ఉన్నారు. వైసీపీలో ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించారు. ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్
సరిగ్గా ఇలానే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెంది, రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అనేక మంది సీనియర్ అధికారులు పాత్ర ఉంది. తెలంగాణలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష నేతలు, బిజినెస్ వర్గాలు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారని ఒక్కసారిగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు చేపడుతుంది. అందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను సిట్ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఇది దేనికి దారి తీస్తుందో చూడాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం