Guntur Robbery : ప్రేమపెళ్లికి తల్లిదండ్రులు నిరాకరణ, ప్రియుడితో సొంత ఇంట్లోనే చోరీ చేయించిన యువతి
Guntur Robbery : ప్రేమికుడితో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదని...ప్రియుడితో సొంత ఇంటికే కన్నం వేయించింది యువతి. ఇదే అదునుగా ప్రియుడు రూ.90 లక్షల విలువైన నగలు చోరీ చేసి పరారయ్యాడు. ఈ వింత చోరీ గుంటూరు జిల్లాలో జరిగింది.
Guntur Robbery : గుంటూరు జిల్లాలో విచిత్రమైన దొంగతనం చోటు చేసుకుంది. ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో పెళ్లి కోసం తల్లిదండ్రులు చేయించిన బంగారు ఆభరణాలను ప్రియుడితోనే యువతి దొంగతనం చేయించింది. ఆ బంగారు ఆభరణాల విలువ ఏకంగా రూ.90 లక్షలు. పోలీసుల విచారణలో కుమార్తె దొంగతనం చేయించినట్లు బయటపడింది. ఆ ప్రేమికుడు పరారీలో ఉన్నాడు.
ఈ ఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇటీవలి గుంటూరు నగరంలో సుమారు రూ.90 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ జరిగింది. ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దొంగతనం కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలో దిగారు. నగరంలో దొంగల ముఠాలపై దృష్టి పెట్టి దర్యాప్తు చేశారు. అయితే ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఈ దొంగతనం పోలీసులకు సవాలుగా మారింది. ఎటువంటి ఆధారాలు దొరకడం లేదు. దీంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదు.
ఫోన్ కాల్ ఆధారంగా
దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంట్లో ఉన్న వారే దొంగతనం చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఇంట్లో అందరినీ విచారించారు. వారి ఫోన్లను కూడా తనిఖీ చేశారు. అయితే ఆ ఇంట్లో ఉన్న యువతి ఫోన్ కాల్స్‌పై అనుమానం వచ్చి, పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగినప్పుడు యువతి ఫోన్ నుంచి ఒకే ఫోన్ నంబర్‌కు అనేక సార్లు కాల్స్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అప్పుడు యువతిని ప్రశ్నించారు. ఆమె నుంచి వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేశారు. అప్పుడే అసలు ట్విస్ట్ బయటపడింది.
తానే దొంగతనం చేయించానని యువతి అంగీకరించింది. తాను ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయడానికి తన తల్లిదండ్రులు అంగీకరించలేదని, అందుకే పెళ్లి కోసం చేయించిన నగలను దొంగతనం చేయించానని తెలిపింది. ఇంట్లో నగలు ఎక్కడున్నాయో చెప్పి తన ప్రియుడిని రమ్మన్నానని, ఆయనతోనే దొంగతనం చేయించానని అంగీకరించింది. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈ దొంగతనం చేయించాలని నిర్ణయించుకున్నాకే, ప్రియుడికి విషయం తెలిపానని పేర్కొంది. అప్పుడు తనపై అనుమానం కూడా రాదని భావించినట్లు తెలిపింది.
యువతి చెప్పిన వివరాల ప్రకారం నిందితుడి ఇంటికి పోలీసులు వెళ్లారు. అక్కడున్న బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే దొంగతనం ఘటన తరువాత ప్రియుడు పరారీ అయ్యాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆయనను పట్టుకున్న తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. దొంగతనం చేయించేవారు ఇంట్లోనే ఉండటంతోనే కేసు ముందుకు సాగలేదని, అప్పుడు ఇంట్లో వారిపైనే అనుమానం వచ్చిందని పేర్కొన్నారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేశామని అన్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం