Guntur Crime : ప్రేమ పేరుతో బీటెక్ విద్యార్థినికి వేధింపులు, పొట్టలో ఇంజక్షన్ పొడిచి పరారీ!
Guntur Crime : గుంటూరులో బీటెక్ విద్యార్థినిపై ఇంజక్షన్ తో దాడి చేశాడో యువకుడు. మూడేళ్లుగా యువతిని నిందితుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలుస్తోంది.
Guntur Crime : బీటెక్ విద్యార్థిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడో యువకుడు. తనను ప్రేమించడంలేదని యువతిపై కక్ష పెంచుకుని ఆమెపై హత్యాయత్నం చేశాడు. ఇంజక్షన్ తో యువతిపై దాడి చేశాడు. యువతి పొట్టలో ఇంజక్షన్ గుచ్చాడు. ఆ ఇంజక్షన్ లో ఏముందోనని పోలీసులు విచారణ చేస్తున్నారు.
అసలేం జరిగింది?
గుంటూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ వసతి గృహంలో ఉంటూ బీటెక్ మూడో సంవత్సరం చదువుతుంది యువతి. ఆ యువతిని గత మూడేళ్లగా ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. యువకుడి వేధింపులు తట్టుకోలేక.. యువతి దిశ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. అయినా అతడిలో మార్పు రాలేదు. యువతిపై వేధింపులు ఆగలేదు. తాజాగా యువకుడు యువతి పొట్టలో ఇంజక్షన్ దించి పరారయ్యాడు. ఆ ఇంజక్షన్‌లో ఏముందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు సిటిజెన్ ఆసుపత్రిలో పనిచేసే నాగ బాలాజీ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కొంత కాలం ప్రేమించుకున్నాక విభేధాలతో విడిపోయారు. స్నేహితులతో మాట్లాడుతుంటే అనుమానిస్తు్న్నాడని... ఆమె అతనిని దూరం పెట్టింది. దీంతో యువకుడు అసలు రంగు బయటపెట్టాడు. యువతిని వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు తట్టుకోలేక యువతి దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరినీ స్టేషన్ కు పిలికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా నాగ బాలాజీ ప్రవర్తనలో మార్పు రాలేదు.
పోలీస్ స్టేషన్ ముందే యువతిపై దాడి
మంగళవారం యువతి కాలేజీకి వెళ్లే బస్సును వెంబడించాడు నాగ బాలాజీ. కాలేజీ దగ్గర యువతి దిగగానే ఒకసారి మాట్లాడాలని, తనతో రమ్మని బలవంతం చేశాడు. దీంతో యువతి అతనితో పాటు ఆటో ఎక్కింది. ఆ ఆటో గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే యువతి ఆటో దిగేందుకు ప్రయత్నించగా,నాగబాలాజీ తనతో తెచ్చిన ఇంజక్షన్ యువతి పొట్టలో పొడిచాడు. అతడి నుంచి తప్పించుకున్న ఆమె.. వెంటనే అరండల్ పేట పోలీస్ స్టేషన్ లోకి పరిగెట్టింది. యువతిని గమనించిన పోలీసులు... నాగ బాలాజీ పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పరారయ్యాడు. యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నాగ బాలాజీ యువతికి ఏ ఇంజక్షన్ చేశాడో అన్న భయం ఆమె బంధువుల్లో నెలకొంది. వైద్య పరీక్షల అనంతరం యువతిని 24 గంటల అబ్జెర్వేషన్ లో ఉంచి ఇంటికి పంపించారు వైద్యులు. అయితే నిందితుడు నాగ బాలాజీ పట్టుబడితే గాని ఏ ఇంజక్షన్ చేశాడో తెలియదని పోలీసులు అంటున్నారు. యువతిని తనతో పాటు తీసుకెళ్లేందుకు సెలైన్ వాటర్ ఇంజక్షన్ తో బెదిరించాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.