Guntur : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు-guntur court grants bail to former bapatla mp nandigam suresh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guntur : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Guntur : బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Basani Shiva Kumar HT Telugu
Jan 28, 2025 05:52 PM IST

Guntur : దాదాపు నాలుగు నెలలుగా జైల్లోనే ఉన్న నందిగం సురేష్‌కు ఊరట లభించింది. గుంటూరు కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా రెండు కేసుల్లో నందిగం సురేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరు
నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరు

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో గతేడాది సెప్టెంబర్‌లో సురేష్‌ను అరెస్ట్ చేశారు. అ తర్వాత మరియమ్మ హత్య కేసులో అక్టోబరు 7వ తేదీన పీటీ వారెంట్‌పై మరోసారి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 7న సుప్రీం కోర్టులో సురేష్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయ్యింది. ఈ నేపథ్యంలో.. గుంటూరు నాల్గో జిల్లా కోర్టులో సురేష్ తరపున న్యాయవాది తానికొండ చిరంజీవి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.

yearly horoscope entry point

కేసుల నేపథ్యం ఇదీ..

గతేడాది సెప్టెంబర్ 5వ తేదీన సాయత్రం హైదరాబాద్‌లో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. సురేష్‌ తోపాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని వారు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

అరెస్టు చేసేందుకు వెళ్లగా..

దీంతో సురేష్‌ను అరెస్టు చేసేందుకు ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూశారు. అక్కడ లేరని తెలియడంతో పోలీసులు వెనుదిరిగారు. అయితే.. అరెస్టు భయంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఫోన్‌ స్విచాఫ్‌ చేశారనే ప్రచారం జరిగింది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా.. ఆయన ఎక్కడున్నారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.

పక్కా సమాచారంతో..

హైదరాబాద్‌ వెళ్లి, అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నిస్తున్నారనే సమాచారంతో.. పోలీసులు అక్కడికి వెళ్లారు. పక్కా సమాచారంతో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, నందిగం సురేష్‌ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్‌ శైలజ భర్త శ్రీనివాస్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

మరియమ్మ హత్య కేసులో..

అటు తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్య కేసులోనూ నందిగం సురేష్ నిందితుడిగా ఉన్నారు. 2020 డిసెంబర్‌లో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. రాళ్లు రువ్వుకున్న ఘటనలో మరియమ్మ మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పట్లో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నందిగం సురేష్‌ను 78వ నిందితుడిగా చేర్చారు. ఈ రెండు కేసుల్లో నందిగం సురేష్ చాలాసార్లు బెయిల్ కోసం ట్రై చేశారు. కానీ రాలేదు. తాజాగా గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చింది.

Whats_app_banner