ANU Hostel Food : నాగార్జున వ‌ర్సిటీ హాస్టల్ భోజ‌నంలో క‌ప్ప, బొద్దింక‌-విద్యార్థినుల ఆందోళ‌న‌, వార్డెన్ బెదిరింపులు-guntur anu girl hostel food found frog cockroach student protested allegation on chief warden ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anu Hostel Food : నాగార్జున వ‌ర్సిటీ హాస్టల్ భోజ‌నంలో క‌ప్ప, బొద్దింక‌-విద్యార్థినుల ఆందోళ‌న‌, వార్డెన్ బెదిరింపులు

ANU Hostel Food : నాగార్జున వ‌ర్సిటీ హాస్టల్ భోజ‌నంలో క‌ప్ప, బొద్దింక‌-విద్యార్థినుల ఆందోళ‌న‌, వార్డెన్ బెదిరింపులు

HT Telugu Desk HT Telugu
Nov 30, 2024 03:35 PM IST

ANU Hostel Food : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థినుల హాస్టల్ లో కలుషిత ఆహారం కలకలం రేపుతోంది. ఆహారంలో కప్ప, బొద్దింక, పురుగులు రావడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వర్సిటీ అధికారుల స్పందించకపోవడంతో అర్ధరాత్రి వరకు ఆందోళన కొనసాగించారు.

నాగార్జున వ‌ర్సిటీ హాస్టల్ భోజ‌నంలో క‌ప్ప, బొద్దింక‌-విద్యార్థినుల ఆందోళ‌న‌, వార్డెన్ బెదిరింపులు
నాగార్జున వ‌ర్సిటీ హాస్టల్ భోజ‌నంలో క‌ప్ప, బొద్దింక‌-విద్యార్థినుల ఆందోళ‌న‌, వార్డెన్ బెదిరింపులు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)ని విద్యార్థినుల హాస్టల్‌ఆహారంలో ఒకే రోజు క‌ప్ప, బొద్దింక‌, పురుగులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప‌లుసార్లు ఫిర్యాదుచేసిన అధికారులు ప‌ట్టించుకోలేదని విద్యార్థినులు ఆందోళ‌న చేప‌ట్టారు. ఫిర్యాదు చేసిన విద్యార్థినుల‌పై వార్డెన్ వెంక‌ట‌రత్నం బెదిరింపులకు దిగారు.

శుక్రవారం మ‌ధ్యాహ్నం విద్యార్థినులు భోజ‌నం చేస్తున్న స‌మ‌యంలో సాంబారులో క‌ప్ప రావ‌డంతో ఒక్కసారిగా ఉలిక్కి ప‌డ్డారు. వెంట‌నే వార్డెన్ దృష్టికి తీసుకెళ్లగా ఈ విష‌యం బ‌య‌ట చెబితే భ‌విష్యత్తులో ఇబ్బంది ప‌డ‌తార‌ని హెచ్చరించారు. మ‌ళ్లీ రాత్రి భోజ‌నం స‌మ‌యంలో విద్యార్థినుల భోజ‌నంలో బొద్దింక వ‌చ్చింది. దీంతో విద్యార్థినులు హాస్టల్ అధికారుల‌ను ప్రశ్నించారు. మ‌ళ్లీ వంట వండి విద్యార్థినులకు పెట్టారు. అప్పుడు పురుగులు వ‌చ్చాయి. దీంతో విద్యార్థినులు హాస్టల్ గేటు వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు.

విద్యార్థినుల ఆందోళ‌న గురించి తెలుసుకున్న హాస్టల్ చీఫ్ వార్డెన్ వెంక‌ట రత్నం అక్కడ‌కు చేరుకున్నారు. అయినా విద్యార్థినుల‌తో మాట్లాడ‌లేదు. విద్యార్థినులు త‌మ‌కు మంచి భోజ‌నం పెట్టాల‌ని, త‌మ‌కు న్యాయం చేయాల‌ని నినాదాలు చేస్తూ ర్యాలీగా వైస్ ఛాన్సల‌ర్ భ‌వ‌నం వ‌ద్దకు చేరుకున్నారు. అక్కడ విద్యార్థినులు ఆందోళ‌న కొన‌సాగించారు. భారీ స్థాయిలో పోలీసులు యూనివర్సిటీకి చేరుకున్నారు. అరగంట త‌రువాత ఆందోళ‌న వ‌ద్దకు రిజిస్ట్రార్ జి.సింహాచ‌లం వ‌చ్చారు. ఆందోళ‌న చేస్తోన్న విద్యార్థినుల‌తో చ‌ర్చించారు. అయితే వైస్ ఛాన్సల‌ర్ రావాల్సిందేన‌ని విద్యార్థినులు డిమాండ్ చేశారు. దీంతో మ‌రో 45 నిమిషాలు త‌రువాత వైస్ ఛాన్సల‌ర్ కె. గంగాధ‌ర్ రావు ఆందోళ‌న వ‌ద్దకు చేరుకున్నారు.

ఆయ‌న ఆందోళ‌న చేస్తున్న విద్యార్థినుల‌తో చ‌ర్చలు జ‌రిపారు. ఇప్పుడు కొత్తగా ఏమీ రావ‌టం లేద‌ని, గ‌తంలో కూడా చాలా సార్లు వ‌చ్చాయ‌ని, ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజ‌నం లేద‌ని విద్యార్థినులు మొర పెట్టుకున్నారు. అలాగే ప్రతివారం హాస్టల్‌ను విజిట్ చేయాలని, అలాగే భోజ‌నానికి సంబంధించి తాము నోట్ బుక్‌లో రాసే అభిప్రాయాల‌ను చెక్ చేయాల‌ని, అలాగే వాట‌ర్ ట్యాంక్‌లు క్లీనింగ్ వంటి ప‌లు డిమాండ్లను వైస్ ఛాన్సల‌ర్, రిజిస్ట్రార్ ముందు విద్యార్థినులు పెట్టారు. వీటికి వైస్ ఛాన్సల‌ర్, రిజిస్ట్రార్ అగీక‌రించ‌డంతో విద్యార్థినులు ఆందోళ‌న విరమించారు. రాత్రి 8.30 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఆందోళ‌న, రాత్రి 11.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగింది. శ‌నివారం ఉద‌యం రిజ‌స్ట్రార్ సింహాచ‌లం విద్యార్థినుల హాస్టల్‌ను సంద‌ర్శించి, అక్కడ విద్యార్థినులు లేవ‌నెత్తిన డిమాండ్లపై ప‌ర్యవేక్షించారు.

అయితే ద‌స‌రా సెల‌వుల‌కు ముందునుంచే పురుగులు, జెర్రిలు ఉన్న క‌లుషిత భోజ‌నం పెట్టడంపై విద్యార్థినులు హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేశారు. ఆ స‌మ‌యంలో కూడా చీఫ్ వార్డెన్ విద్యార్థినుల ప‌ట్ల దురుసుగా వ్యవ‌హరించారని ఫిర్యాదులు వచ్చాయి. మీ ఇంటి వ‌ద్ద ఏమైనా మంచి భోజ‌నం తింటారా? అని ఫిర్యాదు చేసే విద్యార్థినుల‌ను ప్రశ్నించారని తెలుస్తోంది. తాము కూడా ఇదే భోజనం చేస్తున్నామ‌ని, ఏదో స‌ర్ధుకుపోవాల‌ని చీఫ్ వార్డెన్ త‌మ ప‌ట్ల దురుసుగా వ్యవ‌హ‌రించేవార‌ని ఒక‌ విద్యార్థిని అన్నారు. అలాగే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా ఫిర్యాదు చేయ‌డంతో వైస్ ఛాన్సల‌ర్, రిజ‌స్ట్రార్, అధికారులు హాస్టల్‌ను సంద‌ర్శించారు. మంచి భోజ‌నం పెట్టిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆ త‌రువాత ఎవ‌రైతే ఫిర్యాదు చేశారో ఆ న‌లుగురు విద్యార్థినులను హాస్టల్ చీఫ్ వార్డెన్ ల‌క్ష్యంగా చేసుకొని ఇబ్బందుల‌కు గురిచేశారు.

తాజాగా ఒక్క న‌వంబ‌ర్ నెల‌లోనే గాజు పురుగులు, జెర్రి, క‌ప్ప వంటివి రావ‌డంతో విద్యార్థినులు ఆందోళ‌న చెందుతున్నారు. త‌మ త‌ల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని ఫీజులు చెల్లిస్తున్నార‌ని, శుభ్రమైన భోజ‌నం పెట్టలేరా? అంటూ విద్యార్థినులు మండిప‌డ్డారు. ఫిర్యాదు చేస్తే త‌మ‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని ఎస్ఎఫ్ఐ నాయ‌కురాలు న‌వీత పేర్కొన్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ తామేన‌ని, భోజ‌న స‌మ‌స్యల‌పై ఫిర్యాదు చేస్తే త‌మ‌కు హాస్టల్ రూమ్ ఇవ్వకుండా చాలా రోజులు తిప్పించార‌ని గుర్తు చేశారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వరరావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం