Kodali Nani On Chiranjeevi : పకోడీ గాళ్లు కామెంట్స్ చిరంజీవిని ఉద్దేశించి కాదు, కొడాలి నాని క్లారిటీ
Kodali Nani On Chiranjeevi : గతంలో తాను చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి కాదని మాజీ మంత్రి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడ్ని కాదన్నారు.
Kodali Nani On Chiranjeevi : ఇటీవల వాల్తేరు వీరయ్య 200వ రోజు వేడుకల్లో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. హీరోల రెమ్యునరేషన్ కంటే పెద్దల సమస్యలు ఉన్నాయని, సినిమా వాళ్లపై పడతారేందుకు అంటూ చిరంజీవి అన్నారు. చిరంజీవి వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే మాట్లాడారని మంత్రులు, మాజీ మంత్రులు రంగంలోకి దిగి మాటల యుద్ధం చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి రోజా, పేర్ని నాని ఇలా వైసీపీ దిగ్గజాలు విమర్శల వర్షం కురిపించారు. అయితే ఈ విషయంపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడ్ని కాదని ఆయన అన్నారు. గతంలో చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకల్లో కొడాలి
తాను శ్రీరామ అన్నా టీడీపీ, జనసేనలకు బూతులానే వినిపిస్తుందని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు. ఆరోజు తానేం మాట్లాడానో చిరంజీవి, ఆయన ఫ్యాన్స్ కు తెలుసన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన నేతలు తనకు చిరంజీవికి మధ్య గ్యాప్ సృష్టించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. గుడివాడలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు(Megastar Chiranjeevi Birthday) వేడుకల్లో కొడాలి నాని పాల్గొన్నారు. కేక్ కట్ చేసి చిరంజీవి ఫ్యాన్స్ కు పంచారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. తాను చిరంజీవిని విమర్శించినట్లు నిరూపించాలని సవాల్ చేశారు. తన వెంట ఉన్న అనుచరుల్లో 60 శాతం మంది చిరంజీవి అభిమానులే అన్నారు. ఎవరి జోలికి వెళ్లని చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడ్ని కాదని కొడాలి అన్నారు.
పకోడీ గాళ్లకు సలహాలు
ప్రజారాజ్యం తరఫున తన ఆఫీస్ మీదుగా చిరంజీవి ర్యాలీగా వెళ్లిన సమయంలో ఆయనకు చేతులెత్తి నమస్కరించానని కొడాలి నాని అన్నారు. అయితే సీఎం జగన్‌ను ఎవరు విమర్శించినా ఊరుకోమన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు గుడివాడ రోడ్ల మీద దొర్లారని సెటైర్లు వేశారు. మెగాస్టార్ ను అనేక సందర్భాల్లో కలిశానని, పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామన్నారు. తమకు సూచనలు ఇచ్చినట్లే డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్లకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే తాను చెప్పానన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి కాదని కొడాలి నాని పేర్కొన్నారు.
గతంలో కొడాలి నాని ఏమన్నారంటే?
వాల్తేరు వీరయ్య 200వ రోజు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి కొడాలి నాని అప్పట్లో కౌంటర్ ఇచ్చారు. సినిమాల్లో నటించే కొందరు పకోడిగాళ్లు తమకు ఉచిత సలహాలు ఇస్తున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వం ఎలా ఉండాలో నీతులు చెప్పే పకోడిగాళ్లు సినిమా హీరోలు ఎలా ఉండాలో కూడా తెలుసుకోవాలన్నారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు మా గురించి మాట్లాడుతున్న పరిశ్రమలోని వ్యక్తులకు ఇస్తే బాగుంటుందన్న కొడాలి నాని అన్నారు. చిత్ర పరిశ్రమలో చాలా మంది పకోడిగాళ్లు తమకు సలహాలిస్తున్నారని అదేదో సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకు సలహాలు చెప్పొచ్చు కదా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కొడాలి క్లారిటీ ఇచ్చారు.