ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన 50వ సీఆర్డీఏ అథారిటీ రాజధాని నిర్మాణానికి అవసరమైన కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. మొత్తం 7 అంశాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. రాజధాని పరిధిలో మరో 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు అథారిటీ ఆమోదం తెలిపింది.
పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కార్లపూడిలేమల్లే, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో ఈ భూ సమీకరణ చేసేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని ఇచ్చింది. రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్‌ఎఫ్‌పీ పిలిచేందుకు ఆమోదాన్ని తెలిపింది.
మందడం, రాయపూడి, పిచుకలపాలెంలలో ఫైనాన్స్, స్పోర్ట్స్ సిటీల్లోని దాదాపు 58 ఎకరాల్లో ఈ హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ఎఫ్‌పిని ఆహ్వానించేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చింది. అలాగే అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్లకు సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ చేసిన ప్రతిపాదనలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలిపింది.
మందడంలో వివాంతా, హిల్టన్ హోటల్స్, తుళ్లూరులో హయత్ రీజెన్సీ, లింగాయపాలెం నోవోటెల్ సమీపంలో ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి 2.5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. క్వాలిటీ బేస్డ్ సెలెక్షన్ ప్రాతిపదికన ఈ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలియచేసింది.
మరోవైపు రాజధాని అమరావతిలో స్ఫూర్తినిచ్చే వారి స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో నిర్మించే ఎకో పార్కులకూ మంచి పేర్లను పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కొత్త ప్రాజెక్టుల కోసం అధికారులు ఎలాంటి బేషజాలు లేకుండా ప్రయత్నాలు చేయాలని సూచించారు. అమరావతి రాజధాని రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని, గతంలో రాష్ట్ర సచివాలయం వేగంగా రికార్డు సమయంలో నిర్మించామన్నారు. అదే స్ఫూర్తితో పనులు పూర్తి చేయాలని అన్నారు. అమరావతిలో ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో కేంద్రంతో సంప్రదింపులు చేయాలని అధికారులకు సీఎం సూచించారు.