Green Line Error: ఫోన్‌లో గ్రీన్ లైన్ ఎర్రర్ వచ్చిందా? ఇలా జాగ్రత్త పడండి, మాల్‌వేర్ కూడా అయ్యుండొచ్చు…
Green Line Error: కొన్ని బ్రాండ్ల మొబైల్ ఫోన్లలో ఇటీవలి కాలంలో గ్రీన్ లైన్ ఎర్రర్ సమస్య ఎదురవుతోంది. ప్రధానంగా దేశీయ మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న కంపెనీ ఫోన్లలో ఈ సమస్య ఎదురవుతోంది.
Green Line Error: దేశంలో అత్యధికంగా విక్రయిస్తోన్న మొబైల్ బ్రాండ్లలో ఇటీవల గ్రీన్ లైన్ ఎర్రర్ ఇష్యూ అధికం అవుతోంది. దేశీయంగా ఉత్పత్తవుతున్న విదేశీ బ్రాండ్ ఫోన్లతో పాటు విదేశాల్లోతయారవుతున్న మొబైల్ ఫోన్లలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. గత రెండు మూడు నెలల్లో ఫోన్ స్క్రీన్ మధ్యలో నిలువున గీత ఏర్పడటం వంటి సమస్యలు ఫోన్లలో ఎదురవుతున్నాయి.

సాఫ్ట్ వేర్ అప్డేట్లలో ఎదురైన సమస్యల వల్ల మొబైల్ ఫోన్లలో ఈ తరహా సమస్యలు వచ్చాయని అయా బ్రాండ్ల సర్వీస్ సెంటర్లలో చెబుతున్నారు. మరోవైపు ఖరీదైన మొబైళ్లలో డిస్‌ప్లే ఎర్రర్‌లు వస్తుండటంతో వాటిని కొనుగోలు చేసిన వారు లబోదిబోమంటున్నారు. హైక్వాలిటీ పిక్చర్, కర్వ్ డిస్‌ప్లే వంటి హంగులతో ఉన్న ఫోన్లు కూడా ఏడాదిన్నర లోపే మొరాయిస్తున్నాయి.
చైనా తయారీ బ్రాండ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని మొబైల్ విక్రేతలు చెబుతున్నారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న బ్రాండ్లలో అత్యధికంగా చైనాలో తయారైనవే అయినా, ప్రత్యేకించి రెండేళ్లలోపు విడుదలైన బ్రాండ్లలో ఈ సమస్య ఎదురవుతున్నట్టు చెబుతున్నారు. కొద్ది వారాలుగా సాంకేతిక లోపాలను సరిదిద్దుతామని అయా కంపెనీల నుంచి సమాచారం వస్తున్నా వాటిని పూర్తిగా సరిచేయలేకపోయారని ప్రముఖ రిటైల్ స్టోర్ విక్రేతలు చెబుతున్నారు.
అప్డేట్ చేశారో అంతే సంగతులు…
మొబైల్ కంపెనీలు తరచూ వాటి సాఫ్ట్‌వేర్‌లను అప్డేట్ చేస్తుండటాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఏర్పడిన బగ్ ఇష్యూల వల్ల డిస్‌ప్లే ఎర్రర్ వస్తున్నట్టు గుర్తించిన వాటిని సరిచేయలేకపోయారు. ఏడాది క్రితం మొదట వన్‌ప్లస్ మొబైల్ ఫోన్‌లో ఈ సమస్య కనిపించింది. దీంతో సమస్య ఏర్పడిన ఫోన్లలో ఉచితంగా డిస్‌ప్లే రిప్లేస్‌మెంట్ చేశారు. సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌లతో ఈ లోపాన్ని సరిచేసినా పూర్తిగా సరిచేయలేకపోయారు.
కొద్దివారాలుగా వివో బ్రాండ్ ఫోన్లలో సైతం ఇదే రకమైన సమస్య ఎదురైంది. సాధారణంగా కిందపడినా, నీటిలో పడినా, ఏదైనా బలమైన వస్తువు తాకినా డిస్‌ప్లే సమస్యలు వస్తాయి. ఎలాంటి కారణం లేకుండానే సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయగానే కొన్ని మోడళ్లలో గ్రీన్ లైన్ ఎర్రర్ వస్తోంది.
గ్రీన్ లైన్ ఎర్రర్ వచ్చిన ఫోన్లకు డిస్‌ప్లే మార్చి ఇస్తామని సమస్యలు వచ్చిన మోడళ్ల వినియోగదారులకు నచ్చచెబుతున్నా, దేశీయంగా వాటికి కూడా కొరత ఏర్పడింది. వారంటీ వర్తించని కేసుల్లో డిస్‌ప్లే కొత్త యూనిట్ కోసం దాదాపు రూ.12వేల వరకు వసూలు చేస్తున్నారు. చిన్నపాటి గీతలు ఉన్న వారంటీ తిరస్కరిస్తున్న ఉదంతాలు ఉన్నాయి.
మాల్‌వేర్ కూడా కావొచ్చు…
మొబైల్ ఫోన్లలో గ్రీన్ లైట్ ఎర్రర్, ఆటోమెటిక్‌గా స్క్రీన్ ఆన్ అవ్వడం, స్క్రీన్ మధ్య గ్రీన్ లైట్ వెలగి ఆరిపోవడం ఫోన్లో మాల్ వేర్ చొరబడినపుడు కూడా జరుగుతుందని ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్ సైబర్ సెల్ నిపుణుడొకరు తెలిపారు. ఫోన్లను హ్యాక్ చేసే క్రమంలో వాటిలో మాల్‌వేర్ చొప్పించే ప్రయత్నాలు జరిగినాఇలా జరగొచ్చని హెచ్చరిస్తున్నారు.
హ్యాండ్ సెట్‌లను రిపేర్ చేసే సమయంలో మొబైల్‌లో ఉన్న డేటా భద్రతను, వ్యక్తిగత గోప్యతను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. హ్యాండ్ సెట్ రిప్లేస్‌మెంట్ రిపేర్ సమయంలో సెక్యూరిటీ పాస్‌వర్డ్‌లను కస్టమర్ కేంద్రాల్లో టెక్నిషియన్లకు చెప్పి ఫోన్లను అప్పగించొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. హ్యాండ్ సెట్‌ను రిపేర్ లేదా రిప్లేస్‌మెంట్ కోసం అప్పగించాల్సి వస్తే డేటాను పూర్తిగా బ్యాకప్ తీసుకుని ఫ్యాక్టరీ రిసెట్ చేసి మాత్రమే అప్పగించాలని సూచిస్తున్నారు.