Annamayya district Crime : అమ్మ‌మ్మ‌పై అత్యాచారం, హ‌త్య.. మ‌న‌వ‌డికి జీవిత‌కాల జైలు శిక్ష-grandson sentenced to life imprisonment for raping grandmother in annamayya district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Annamayya District Crime : అమ్మ‌మ్మ‌పై అత్యాచారం, హ‌త్య.. మ‌న‌వ‌డికి జీవిత‌కాల జైలు శిక్ష

Annamayya district Crime : అమ్మ‌మ్మ‌పై అత్యాచారం, హ‌త్య.. మ‌న‌వ‌డికి జీవిత‌కాల జైలు శిక్ష

HT Telugu Desk HT Telugu
Nov 08, 2024 09:29 AM IST

Annamayya district Crime : అన్న‌మ‌య్య‌ జిల్లాలో అమాన‌వీయ‌మైన‌ ఘ‌ట‌న చోటు చేసుకుంది. అమ్మ‌మ్మ‌ను అత్యాచారం చేసి, ఆపై అతి దారుణంగా హ‌త్య చేసిన కేసులో మ‌న‌వ‌డికి జీవిత కాలం జైలు శిక్ష ప‌డింది. ఈ మేరకు చిత్తూరులోని ఆరో అద‌న‌పు జిల్లా కోర్టు న్యాయ‌మూర్తి ఎన్‌.శాంతి గురువారం తీర్పు ఇచ్చారు.

పోలీసుల అదుపులో నిందితుడు ప్రసాద్
పోలీసుల అదుపులో నిందితుడు ప్రసాద్

అద‌న‌పు పబ్లిక్ ప్రాసిక్యూట‌ర్ తోట పురుషోత్తం, అన్న‌మ‌య్య జిల్లా ఎస్పీ విద్యాసాగ‌ర్ నాయుడు, మ‌ద‌న‌ప‌ల్లె రూర‌ల్ స‌ర్కిల్ సీఐ ర‌మేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అన్న‌మ‌య్య జిల్లా కురబ‌ల‌కోట మండ‌లం స‌ద్దికూటివారి ప‌ల్లెకు చెందిన ఇంద్ర ప్ర‌సాద్ (30) కూలి ప‌నులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ప్ర‌సాద్‌కి భార్య‌, పిల్ల‌లు ఉన్నారు. వీరితో పాటు 90 ఏళ్ల వృద్ధురాలైన అమ్మ‌మ్మ‌, త‌ల్లి ఉంటున్నారు.

ఇంద్ర ప్ర‌సాద్ మ‌ద్యం, చెడు అల‌వాట్ల‌కు బానిస‌య్యాడు. సైకోలా ప్రవర్తిస్తున్నాడు. ఇత‌ని ప్ర‌వ‌ర్త‌న‌, వైఖరి స‌రిగ్గాలేక భార్య ఇత‌న్ని వ‌దిలి పుట్టింటికి వెళ్లిపోయింది. 2018 ఏప్రిల్ 6వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అమ్మ‌మ్మ‌పై మ‌ద్యం మ‌త్తులో అత్యాచార‌నికి పాల్ప‌డ్డాడు. ఆపై ఆమెను అత్యంత కిరాతంగా హ‌త్య చేశాడు. వావి వ‌ర‌స‌లు, వ‌యో భేదం మ‌రిచి మృగంలా ప్ర‌వ‌ర్తించాడు.

వృద్ధురాలి సున్నిత భాగాల నుంచి ర‌క్తం రావ‌డాన్ని ప్ర‌సాద్‌ త‌ల్లి గ‌మ‌నించింది. ఆమె చనిపోయి ఉండ‌టం చూసి నిశ్చేష్టురాలైంది. ఉన్మాదిలా కూర్చుని ఉన్న కొడుకు ప్యాంటుపై ర‌క్త‌పు మ‌ర‌క‌లను ప‌సిగ‌ట్టింది. భ‌యంతో కేక‌లు వేసింది. ఇరుగుపొరుగు రావ‌డంతో నిందితుడు ప‌రార‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌సాద్ త‌ల్లి ముదివేడు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

అప్ప‌టి సీఐ ముర‌ళీకృష్ణ నిందితుడిపై కేసు న‌మోదు చేశారు. అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారు. నిందితుడు ప్ర‌సాద్‌ను కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ఈ కేసు వివిధ సంద‌ర్భ‌ాల్లో విచార‌ణ‌కు వ‌చ్చింది. గురువారం తుది విచార‌ణ జ‌రిపిన న్యాయ‌మూర్తి శాంతి, సాక్ష్యాధారాలు ప‌రిశీలించారు. నేరం రుజువు కావ‌డంతో నిందితుడు ఇంద్ర‌ప్రసాద్‌కు జీవించినంత కాలం జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.

కోర్టు లైజ‌నింగ్ అధికారి సాయి సుధాక‌ర్‌, కోర్టు కానిస్టేబుల్ ల‌క్ష్మీనారాయ‌ణ సాక్షుల‌ను కోర్టులో హాజ‌రుప‌రిచి విచార‌ణ‌కు స‌హ‌క‌రించారు. ముదివేడు పోలీసుల‌ను ఎస్పీ విద్యా సాగర్ నాయుడు అభినందించారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner