GOs In Telugu: ఇకపై తెలుగులో కూడా ప్రభుత్వ ఉత్తర్వులు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని శాఖలు అమలు చేయాలని ఆదేశం
GOs In Telugu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై ప్రభుత్వ జీవోలను ఇంగ్లీష్‌తో పాటు తెలుగులో కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు జీవోలు విడుదలైన రెండు రోజుల్లో తెలుగులో కూడా వాటిని విడుదల చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులుు జారీ చేసింది.
GOs In Telugu: ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులో భాషలో కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే మొట్ట మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కావడంతో పాటు తొంభై ఐదు శాతానికి పైగా జనాభా మాట్లాడే తెలుగు భాషకు ఎంతో గౌరవం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ పనితీరులో ప్రభుత్వ ఉత్తర్వులు (G.Os.) కీలక పాత్ర పోషిస్తాయని వివిధ శాఖలు, అధికారులు మరియు ప్రజలకు ప్రభుత్వం జారీ చేసిన నిర్ణయాలు, సూచనలు, విధానాలు మరియు నిబంధనలను తెలియజేయడానికి ఇవి అధికారిక సాధనాలుగా పనిచేస్తాయని జీవోలో పేర్కొన్నారు. ఆంగ్లం మరియు తెలుగు రెండు భాషలలో ప్రభుత్వ ఉత్తర్వులను అందించడం వలన ప్రజలకు వాటిని అందుబాటులో ఉంచడం ద్వారా ప్రత్యేకించి దేశంలో భాషా పరంగా ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంలో తెలుగు బాష సమగ్రతకు తోడ్పడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది.
సచివాలయంలోని అన్ని శాఖల ద్వారా ఆంగ్ల భాష G.O. తో పాటు ప్రతి ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగు భాషలో కూడా అప్లోడ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, ప్రభుత్వం ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత రాష్ట్ర భాషా, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడంతో పాటు పారదర్శకత, సమగ్రతను ప్రోత్సహించడం కోసం, ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు (G.OS.) ఆంగ్లం మరియు తెలుగు రెండింటిలోనూ ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్ 3ను విడుదల చేసింది.
ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను ఇంగ్లీషులోనూ తెలుగులోనూ ఆన్‌లైన్ అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు జారీ చేసి దాన్ని అప్లోడ్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జీవో విడుదలైన రెండు రోజుల్లోగా తెలుగులోనూ అదే ఉత్తర్వు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని వివిధ శాఖలకు సూచనలు చేస్తూ జిఏడి ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో అనువదించడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.