AP Freebus Scheme: ఏపీలో ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలకు ప్రభుత్వం ఏర్పాట్లు
AP Freebus Scheme: ఏపీలో కూటమి పార్టీల ఎన్నికల హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణానికి ముహుర్తం ఖరారైంది. 2025 ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సర్కారు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న బస్సులతో ఉచిత హామీ నెరేవర్చడం సాధ్యం కాకపోవడంతో కొత్తబస్సులతో కలిపి ఉగాది నుంచి అమలు చేస్తారు.
AP Freebus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణాలపై నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి , డీజీపీ , ఆర్టీసీఎండీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అంశంపై తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు. ఈ విధానం అమల్లో ఉన్న కర్ణాటక, దిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తామని అధికారులు సిఎంకు వివరించారు. దీనిపై సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా అందజేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఉగాది నాటికి పథకం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
ఏపీలో సూపర్ సిక్స్ ఎన్నికల హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని టీడీపీ ప్రకటించింది. కొత్త ఏడాది ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలులో జరుగుతున్న జాప్యంపై విమర్శులు ఎదురవుతున్నా సాంకేతిక కారణాలతో వాయిదా పడుతోంది.
ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. అయా జిల్లాల పరిధిలో మహిళలు నెలలో ఎన్నిసార్లయినా, రోజుకు ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డు చిరునమాా ఆధారంగా ప్రయాణాలకు అనుమతిస్తారు. సంక్రాంతి నుంచి పథకాన్ని మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించినా ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలంటే 3,500 బస్సులు, 11,500 మంది సిబ్బంది అవసరమని ఆర్టీసీ అధికారులు సీఎంకు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రెండువేలు కొత్త బస్సులు, అద్దె బస్సులు ఉంటేనేఉచిత ప్రయాణం హామీ అమలు చేయగలమని వివరించారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 69 శాతం ఉందని, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ 94 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. దీంతో పాటు ప్రతి నెలా ఆర్టీసీపై రూ.265 కోట్ల భారం పడనుంది. దీంతో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు పంజాబ్, ఢిల్లీలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణం విధానాలను మహిళ మంత్రులు అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు మంత్రులు అనిత, సంధ్యారాణి త్వరలో పొరుగు రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం అమలు తీరును పరిశీలిస్తారు.