liquor Shops: మూతబడిన ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్‌‌‌లలో పెరిగిన లిక్కర్ విక్రయాలు.. జనం జేబులకు భారీగా చిల్లు-government liquor shops closed in ap liquor sales increased in bars ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Liquor Shops: మూతబడిన ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్‌‌‌లలో పెరిగిన లిక్కర్ విక్రయాలు.. జనం జేబులకు భారీగా చిల్లు

liquor Shops: మూతబడిన ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్‌‌‌లలో పెరిగిన లిక్కర్ విక్రయాలు.. జనం జేబులకు భారీగా చిల్లు

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 02, 2024 08:08 AM IST

liquor Shops: ప్రైవేట్ వైన్‌షాప్‌లకు నోటిఫికేషన్‌ ఇవ్వడంతో ఏపీలో బార్‌ అండ్ రెస్టారెంట్‌లకు ముందే దసరా వచ్చేసింది. మద్యం దుకాణాల కేటాయింపుకు మరో పది రోజుల గడువు ఉండటం, ఉపాధికి భరోసా లేక పోవడంతో ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతబడ్డాయి. దీంతో బార్‌లలో విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి.

ఏపీలో మూతబడిన ప్రభుత్వ మద్యం దుకాణాలు, లాభాలన్నీ బార్‌ అండ్ రెస్టారెంట్‌లకే
ఏపీలో మూతబడిన ప్రభుత్వ మద్యం దుకాణాలు, లాభాలన్నీ బార్‌ అండ్ రెస్టారెంట్‌లకే

liquor Shops: ప్రైవేట్ మద్యం దుకాణాలకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి.గత కొద్ది రోజులుగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న 12వేల మంది తాత్కలిక ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. సోమవారం ప్రైవేట్ దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో వారంతా సమ్మె బాట పట్టారు.దీంతో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లలో క్వార్టర్‌పై రూ.50-100 అదనంగా వసూలు చేసి విక్రయిస్తున్నారు. 

ఏపీలో  ప్రైవేటు షాపులకు లాటరీ నిర్వహిస్తుండటంతో ఉద్యోగాలకు భద్రత కల్పించాలంటూ ప్రభుత్వ షాపుల్లో పనిచేస్తున్న సేల్స్‌మెన్‌, సూపర్ వైజర్లు రోడ్డెక్కారు. ప్రభుత్వ మద్యం షాపులకు తాళాలు వేసి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 2,934 షాపులున్నాయి. వాటిలో మెజార్టీ దుకాణాలు మంగళవారం మూతపడ్డాయి. అధికారులు కొన్నిచోట్ల దుకాణాలు తెరిపించే ప్రయత్నాలు చేశారు.

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రైవేటు మద్యం షాపుల్ని నిర్వహించాలనే నిర్ణయంతో ప్రభుత్వ షాపులు కనుమరుగు కానున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలతో ఏటా రూ.36వేల కోట్ల రుపాయల ఆదాయం ఖజానాకు సమకూరేది. అందులో లోపాలను సవరిస్తే ఈ ఏడాది మరో ఏడెనిమిది వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు.

ప్రైవేట్ మద్యం దుకాణాలకే ప్రభుత్వం మొగ్గు చూపడంతో ఇక ప్రభుత్వ మద్యం దుకాణాలు కనుమరుగు కానున్నాయి. మరోవైపు దుకాణాల రద్దు కానుండటంతో ఉద్యోగాలు కోల్పోతామని అందులో పనిచేస్తున్నవారు ఆందోళన బాట పట్టారు. ఎక్సైజ్‌ డైరెక్టర్ కొద్ది రోజుల క్రితం వారితో చర్చించినా ఫలితం లేకపోయింది. ప్రత్యామ్నయ ఉపాధి కల్పిస్తామని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కొత్త షాపుల నోటిఫికేషన్ రావడంతో దుకాణాలను మూసేశారు.

మద్యం లాభాలన్నీ బార్‌ అండ్ రెస్టారెంట్‌లకే…

మద్యం దుకాణాల్లో పనిచేసే వారి ఆందోళనతో బార్‌ అండ్ రెస్టారెంట్లకు ఇబ్బడి ముబ్బడిగా సరుకు సరఫరా చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్సులను పునరుద్ధరించారు. గత నెలలోనే అన్ని బార్లకు కొత్త లైసెన్సుల జారీ పూర్తి చేశారు. సగటున రూ.85 లక్షల నుంచి కోటి రుపాయల వరకు లైసెన్స్‌ ఫీజుగా చెల్లించి విక్రయాలకు అనుమతులు పునరుద్ధరించుకున్నారు.

తాజాగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగుల సమ్మెతో వారి వ్యాపారం రెట్టింపైంది. ఒక్కో క్వార్టర్ బాటిల్ విక్రయంపై గరిష్టంగా రూ.100 రుపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. దేశవాళీ తయారీ మద్యాన్ని బ్రాండ్లను బట్టి అదనపు ధర వసూలు చేస్తున్నారు.

చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ…

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నిల్వలు తగ్గిపోయాయి. ఆ సరుకు మొత్తం బార్‌లకు సర్దుబాటు చేశారనే అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం దుకాణాల వేలం పూర్తి కాకపోవడంతో మరో 20 రోజులకు సరిపడా నిల్వలు ఏపీ బీసీఎల్ వద్ద ఉన్నాయని ఎక్సైజ్ శాఖ చెబుతోంది.

సాధారణంగా 90,000 కేసుల ఐఎంఎఫ్ లిక్కర్, 23,000 కేసుల బీరును ఏపీలో రోజువారీ సగటు వినియోగంగా ఉంది. ప్రస్తుతం ఉన్న నిల్వలు కనీసం 20 రోజుల వరకు సరిపోతాయని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిక్కర్ డిపోలలో 20 లక్షల కేసుల ఐఎంఎఫ్ఎల్, 5.6 లక్షల కేసుల బీర్ విక్రయానికి అందుబాటులో ఉందని ఎక్సైజ్‌ డైరెక్టర్‌ నిషాంత్ కుమార్ తెలిపారు.

అవుట్ లెట్ వారీగా ఏపీలో 6.93 లక్షల కేసుల ఐఎంఎఫ్ఎల్ సిద్దంగా ఉందని, గతంలో ఉన్న సగటు వినియోగాన్ని పరిగణన లోకి తీసుకుంటే ఈ నిల్వ 9 రోజులు సరిపోతుందని చెబుతున్నారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో మద్యం నిల్వల్ని కూడా ఎప్పటికప్పుడు పెంచుతున్నారు.

గత సంవత్సరం సెప్టెంబరు నెలలో మద్యం విక్రయాల ద్వారా 2487 కోట్లు జరిగాయి. గత బుధవారం నాటికి రూ.1972 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్ చివరికి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకున్నట్టు ఎక్సైజ్ శాఖ చెబుతోంది. మరోవైపు రాష్ట్రంలో మంగళవారం 98 శాతం ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుచుకున్నాయని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఉద్యోగులు కొన్నిచోట్ల ఆందోళన బాట పట్టినా ఆ ప్రభావమేమీ లేదని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి దుకాణాలు తెరిచామని తెలిపారు.

మంగళవారం రూ. 82 కోట్ల విలువైన మద్యం విక్రయించామని చెప్పారు. సాధారణంగా రోజుకు రూ.110-120 కోట్ల విలువైన అమ్మకాలు జరుగుతుంటాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయాలు లేకపోవడంతో ఆ మేరకు లాభాలన్నీ బార్‌ అండ్ రెస్టారెంట్లకు దక్కుతోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున గండి పడుతోంది. కొత్త దుకాణాలు అక్టోబర్ 11 తర్వాత అందుబాటులోకి వస్తాయి. అప్పటి వరకు మద్యం తాగే వారి జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.