AP Town Planing: ఏపీలో యథేచ్చగా టౌన్ ప్లానింగ్ దోపిడీ, అనుమతులపై ప్రకటనలకు పరిమితమైన సర్కారు…
AP Town Planing: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆర్నెల్లు దాటిపోయినా రియల్ ఎస్టేట్, వ్యక్తిగత నిర్మాణదారుల కష్టాలు మాత్రం తీరలేదు. అనుమతుల్ని సరళీకృతం చేసినట్టు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నా క్షేత్ర స్థాయి సమస్యల్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
AP Town Planing: ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ రంగాన్ని కష్టాలు వీడటం లేదు. సులభతరమైన, పారదర్శకమైన అనుమతుల్ని అందిస్తామని ఆరేడు నెలలుగా పురపాలక శాఖ మంత్రి నారాయణ పదేపదే ప్రకటనలు చేస్తున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పేరుకు పోయిన అవినీతి జాడ్యం వదలకపోవడంతో నిర్మాణ రంగం తీవ్రంగా ఇబ్బందులకు గురవుతోంది. ప్రభుత్వ విధానాల్లోనే స్పష్టత లేకపోవడంతో స్థానిక సంస్థలు యథేచ్ఛగా దోచుకుంటున్నాయి. వ్యక్తిగత నిర్మాణాలు మొదలుకుని అపార్ట్‌మెంట్‌ల వరకు అందిన కాడికి దోచుకోడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఏపీలో భవన నిర్మాణాలకు అనుమతుల విషయంలో మంత్రి నారాయణ పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. అనుమతులు అవసరం లేదని, దరఖాస్తు చేసిన 24గంటల్లో అనుమతి మంజూరు అవుతుందని పలుమార్లు చెప్పుకొచ్చారు. ఇక 18మీటర్ల వరకు ఎత్తైన నిర్మాణాల విషయంలో కూడా మంగళవారం నిబంధనల్ని సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అసలు సమస్య అదే…
సొంతింటి నిర్మాణం విషయంలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యల్ని పురపాలక శాఖ పూర్తిగా విస్మరించింది. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఫీజులు చెల్లించాలి అనే దానిపై స్పష్టత లేదు. భవన నిర్మాణాలకు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వేర్వేరుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజుల వసూలులో హేతుబద్దత మాట అటుంచితే ప్రభుత్వానికి చెల్లించే దానికంటే అయా స్థానిక సంస్థల్లో టౌన్ ప్లానింగ్ విభాగాలకు చెల్లించాల్సిన లంచాలే ఎక్కువగా ఉంటున్నాయి
గత ఐదేళ్లలో సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రతి వార్డుకో ప్లానింగ్ సెక్రటరీని నియమించారు. ప్లానింగ్ సెక్రటరీలు తమ ఏరియా కార్పొరేటర్ల కనుసన్నల్లో పనిచేయడం అలవాటుగా చేసుకున్నారు. ఎక్కడ ఇళ్ల నిర్మాణం జరిగితే ఆ సమాచారం స్థానిక ప్రజాప్రతినిధికి చేరవేయడం, వారితో సెటిల్ చేసుకోవాలని చెప్పడం రివాజుగా మారింది.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. 100గజాల్లోపు నిర్మాణాలకు సైతం బలవంతంగా ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. ఇది నిర్మాణదారులపై తీవ్ర భారంగా పరిణమిస్తోంది.
పట్టణాల్లో నిర్మాణాలపై కొరవడిన స్పష్టత..
150-200గజాలకు మించిన స్థలాల్లో జీ ప్లస్ టూ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉండటంతో అలాంటి నిర్మాణాలపై దృష్టి పెడుతున్నారు. 250-300 గజాల స‌్థలాల్లో గ్రూప్ హౌస్‌లకు అవకాశం ఉండటం టౌన్ ప్లానింగ్‌కు వరంగా మారింది.
పట్టణాల్లో 250-300గజాల్లో ఇళ్లు ఉన్న వారు వాటి స్థానంలో గ్రూప్ హౌస్‌ల నిర్మాణం చేపట్టడమో, డెవలప్‌మెంట్‌కు ఇవ్వడమో చేస్తున్నారు. ఈ క్రమంలో 30-40ఏళ్ల క్రితం అన్ని అనుమతులతో కట్టుకున్న ఇళ్ల స్థానంలో కొత్త నిర్మాణాలకు లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్లాన్‌కు అనుగుణంగా ఫ్లోర్ వారీగా, చదరపు అడుగుల లెక్కన ఫీజులు వసూలు చేస్తున్నారు. అప్పటికే ఆ ఇళ్లలో వాటర్, యూజీడీ కనెక్షన్లు ఉన్నా కొత్తగా మళ్లీ ఛార్జీలు వేస్తున్నారు. ఇలా ఒక్కో ఇంటికి విజయవాడలో 300గజాల్లోపు స‌్థలాలకు ఐదంతస్తులు నిర్మించాలంటే ఫీజుల రూపేణా 10లక్షల వరకు ఫీజులుగా వసూలు చేస్తున్నారు. నిర్మాణం పూర్తైన తర్వాత కుళాయి, డ్రెయిన్ల రీ కనెక్షన్ల పేరుతో మళ్లీ వసూలు చేస్తున్నారు.
నిర్మాణంలో ఉన్న కాలానికి పన్నులు…
ఇళ్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించే వారికి పన్నులు భారం చుక్కలు చూపిస్తోంది. ఎవరైనా ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే అనుమతుల కోసం చెల్లించే ఫీజులు ఒక ఎత్తైతే, నిర్మాణాలు పూర్తైన తర్వాత ఇంటి పన్నుల అసెస్మెంట్ మరో భారంగా పరిణమిస్తోంది. భవన నిర్మాణం మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు కాలానికి కూడా పన్ను వసూలు చేస్తున్నారు. భవన నిర్మాణం చేపట్టక ముందు కాలానికి ఖాళీ స్థలం పన్ను వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు లక్షల్లో ఉంటున్నాయి.
నిబంధనలు ఏమిటో ఎవరికి తెలియవు..
భవన నిర్మాణాలకు సంబంధించిన అమల్లో ఉన్న నిబంధనలు, మునిసిపాలిటీల వారీగా నిర్మాణదారులు చెల్లించాల్సిన ఫీజుల వివరాలు కోరుతూ ఆర్టీఐ దరఖాస్తులు చేసినా పట్టణ ప్రణాళిక విభాగాలు వివరాలు ఇవ్వడం లేదు. భవన నిర్మాణ దారులు దేనికి ఎంత చెల్లించాలనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ప్రధానంగా కార్పొరేషన్లు, పట్టణాలకు దగ్గరగా ఉండే గ్రామాల్లో టౌన్ ప్లానింగ్ సిబ్బంది చెప్పినంత చెల్లించాల్సి వస్తోంది. ఫీజుల్లో హేతుబద్దత, వివరణలు కూడా ఇవ్వడం లేదు. నిర్మాణాలు పూర్తైన చోట పన్నుల్ని నిర్ణయించడంలో మరో రకమైన దందా నడుస్తోంది.
నారాయణ నారాయణ…
మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్టర్లు, నిర్మాణదారులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చినా వాటిని పరిష్కరించడంలో విఫలమయ్యారు. 24 గంటల్లో అనుమతులు, ఆన్‌లైన్ పర్మిషన్ల పేరుతో ప్రచారం చేసుకోడానికి పరిమితం అయ్యారు. ఏ క్యాటగిరీలో ఎంత ఫీజులు చెల్లించాలి, స్థలం విస్తీర్ణంతో పాటు నిర్మాణం చేపట్టే ప్రాంతానికి ఎన్ని ఫ్లోర్లకు ఎంత చెల్లించాలనే విషయాన్ని మాత్రం దాటవేస్తున్నారు. గతంలో మాదిరే అనుమతుల గుట్టును ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మధ్యే ఉండేలా జాగ్రత్త పడ్డారనే విమర్శలు ఉన్నాయి.
సంబంధిత కథనం