AP Liquor Shops: గీత కులాలకు ఇచ్చే మద్యం దుకాణాలకు ఈ వారమే నోటిఫికేషన్, కొలిక్కి వచ్చిన కసరత్తు-government gears up to issue liquor shop licenses quota reserved for geetha communities ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Liquor Shops: గీత కులాలకు ఇచ్చే మద్యం దుకాణాలకు ఈ వారమే నోటిఫికేషన్, కొలిక్కి వచ్చిన కసరత్తు

AP Liquor Shops: గీత కులాలకు ఇచ్చే మద్యం దుకాణాలకు ఈ వారమే నోటిఫికేషన్, కొలిక్కి వచ్చిన కసరత్తు

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 17, 2025 09:03 AM IST

AP Liquor Shops: ఏపీలో గీత కులాలకు కేటాయించే మద్యం దుకాణాలకు నోటిఫికేషన్‌ వారం రోజుల్లో విడుదల కానుంది. గత ఏడాది అక్టోబర్ 16 నుంచి ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి. మొత్తం దుకాణాల్లో 10శాతం దుకాణాలను గీత కులాలకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీలో మద్యం దుకాణాలపై సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు
ఏపీలో మద్యం దుకాణాలపై సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు

AP Liquor Shops: ఏపీలో గీత కులాలకు కేటాయించిన మద్యం దుకాణాలకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు విక్రయాలు జరుపుతున్నాయి. వైసీపీ హయంలో ఐదేళ్ల పాటు ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో ప్రైవేట్‌ దుకాణాలను వేలం పద్దతిలో కేటాయించింది.

మొత్తం దుకాణాల్లో 10శాతం దుకాణాలను గీత కులాలకు కేటాయించారు. 340 దుకాణాలను మినహాయించి మిగిలిన వాటిని వేలం వేశారు. గీత వృత్తిని చేపట్టే ఉపకులాల వారీగా వారం రోజుల్లో వీటికి నోటిఫికేషన్ జారీ చేయనుంది. గీత కులాలకు మద్యం దుకాణాల కేటాయింపుపై నేడు జరిగే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటారు.

మద్యం దుకాణాల కేటాయింపులో మొదట గీత కార్మికుల ఆధారంగా షాపులు కేటాయించాలని భావించినా ఆ తర్వాత గీత కులాల వారీగా షాపుల్ని కేటాయించాలని నిర్ణయించారు. గత ఏడాది అక్టోబరులో అమల్లోకి వచ్చిన కొత్త మద్యం షాపుల పాలసీలో 3,396 షాపులకు లైసెన్సులు జారీ చేశారు.

దుకాణాల్లో గీత కులాలకు కేటాయించిన 10శాతం దుకాణాలకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. మొత్తం 340 షాపుల్లో నాలుగు షాపులు పొండి కులానికి విడిగా కేటాయిస్తారు. ముఖ‌్యమంత్రి హామీ ఇచ్చిన కుటుంబానికి ఒక షాపును కేటాయించనున్నారు. మిగిలిన 335 షాపు ల కేటాయింపుకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసే వారు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ సమర్పించాల్సి ఉంటుంది . గీత కులాల దుకాణాలకు దరఖాస్తు రుసుముగా రూ.2లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజు రూ.25లక్షలు చెల్లించాలి.

జిల్లాల వారీగా ఏర్పాటయ్యే మద్యం దుకాణాలు..

అనంతపురంలో 14, శ్రీసత్యసాయిలో 9, అన్నమ య్యలో 11, చిత్తూరులో 10, తూర్పుగోదావరిలో 13, కాకినాడలో 16, కోనసీమలో 13, బాపట్లలో 12, గుంటూరులో 13, పల్నాడులో 13, కడపలో 14, కృష్ణాలో 12, ఎన్టీఆర్ లో 11, కర్నూలులో 10, నంద్యా లలో 11, నెల్లూరులో 18, ప్రకాశంలో 18, పార్వతీ పురం మన్యంలో 4, శ్రీకాకుళంలో 18, అనకాపల్లిలో 15, విశాఖపట్నంలో 14, విజయనగరంలో 16, ఏలూరులో 14, పశ్చిమగోదావరిలో 18 షాపులు గీత కులాలకు కేటాయించనున్నారు. అల్లూరి జిల్లాలో దుకాణాలు ఏమి లేవు.

జిల్లాల వారీగా గీత కులాల జనాభా ఆధారంగా ఏ జిల్లాకు ఎన్ని షాపులు కేటాయించాలనే వివరాలు ఎక్సైజ్ శాఖ సేకరించింది. 2016లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వేలో కులాల వారీగా జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకున్నారు. ఏపీలో ఉన్న గీత కులాలను మూడు విభాగాలుగా విభజించి కేటాయించనున్నారు.

గీత కులాల్లో ఎ-కేటగిరీలో యాత, బి-కేటగిరీలో గౌడ, ఈడిగ, గౌడ(గమళ్ల), కలాలీ, గౌండ్ల, శ్రీసాయన, సొండి, శెట్టిబలిజ కులాలున్నాయి. మరో కేటగిరీలో సోండి కులాన్ని విడిగా చూపించారు. జిల్లాల వారీగా ఆ కులానికి ఉన్న జనాభా ఆధారంగా షాపులు కేటాయించాలని నిర్ణయించారు. తిరుపతి జిల్లాలో అత్యధి కంగా 23 షాపులు గీత కులాలకు దక్కగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక్కటీ లేదు.

గీత కార్మికులు, కులాలకు షాపుల కేటాయింపుపై అభ్యంతరాలు లేకున్నా లైసెన్స్‌ ఫీజును రూ.25లక్షలు నిర్ణయించడాన్ని మద్యం వ్యాపారులు తప్పు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల నిర్వహిణలో అయా నియోజక వర్గాల ఎమ్మెల్యేల పెత్తన కొనసాగుతోంది. కొత్తగా కేటాయించే దుకాణాలను కూడా గీత కులాలకు దక్కుతాయనే నమ్మకం లేదు. ప్రతి ఊళ్లో స్థానిక ప్రజాప్రతినిధి నిర్ణయించిన వారే మద్యం వ్యాపారం చేయాల్సి ఉంది.

మరోవైపు గీత కులాలకు కేటాయించే లైసెన్స్ ఫీజు తక్కువ కావడంతో వాటిని కూడా విడిచిపెట్టరనే గుసగుసలు ఉన్నాయి. బెదిరించి, బుజ్జగించి ఈ దుకాణాలను కూడా ప్రజాప్రతినిధులు లాక్కుంటారనే ఆరోపణలు ఉన్నాయి.

Whats_app_banner