Nellore Crime : భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసి.. ప్రియురాలితో వెళ్లిపోయిన ప్రభుత్వ ఉద్యోగి!
Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి బరితెగించాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య, పిల్లలను వదిలేసి ప్రియురాలితో పరారయ్యాడు. భర్త కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో భార్య పోలీసులను ఆశ్రయించింది. మరోవైపు ప్రియురాలి బంధువులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దగదర్తి మండలం కేంద్రం అరుంధతీయ కాలనీకి చెందిన ఉమామహేశ్వరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉమామహేశ్వరరావు ప్రభుత్వ ఉద్యోగి. ఆయన తిరుపతి జిల్లా తడలో వెటర్నటీ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. భార్యా భర్తలు, పిల్లలతో కుటుంబం సంతోషంగా ఉంది. కానీ కొన్ని రోజులుగా కుటుంబంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.
మరో మహిళతో..
అందుకు కారణం.. ఉమామహేశ్వరరావు తడలో ఉద్యోగం చేస్తూ.. గుమ్మడిపూడికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం పెట్టుకోవడం తెలిసిన భార్య నిలదీసింది. ఆమెతో పాటు పిల్లలు కూడా తన తండ్రి చేసే పనిని ప్రశ్నించారు. దీంతో భార్య, పిల్లలను ఉమామహేశ్వరరావు వేధించడం మొదలపెట్టాడు.
పోలీసులకు ఫిర్యాదు..
ఇంట్లో భార్య, పిల్లలు నిలదీయడంతో.. వారిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రియురాలితో కలిసి వెళ్లిపోవాలని ప్లాన్ చేశాడు. ఈనెల 7వ తేదీన ప్రియురాలితో కలిసి ఉమామహేశ్వర రావు పరారయ్యాడు. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. కానీ వారి ఆచూకీ లభించలేదు. దీంతో భార్య గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళ తరఫు బంధువులు కూడా..
భార్య ఫిర్యాదు మేరకు భర్త ఉమామహేశ్వర రావుపై కేసు నమోదు చేసినట్లు.. ఎస్ఐ జంపానికుమార్ వివరించారు. పరారీలో ఉన్న వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఆచూకీ తెలిసిన వెంటనే వారిని తీసుకొస్తామని.. అప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఆ మహిళ తరపు బంధువులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రియురాలితో పెళ్లి కోసం..
ప్రియురాలితో పెళ్లి కోసం కత్తితో కోసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన రవితేజకు ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఇందిరాకాలనీకి చెందిన పుట్టా లక్ష్మీదేవితో పరిచయం ఏర్పడింది. లక్ష్మీ భర్త ఐదేళ్ల క్రితం చనిపోయాడు. కొద్ది రోజులుగా లక్ష్మీని పెళ్లి చేసుకుంటానని రవితేజ గొడవ పడుతున్నాడు.
ఈ క్రమంలో గురువారం ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన రవితేజ గురువారం రాత్రి మద్యం సేవించి కనిగిరి ప్రభుత్వాసుపత్రి సమీపంలో కత్తితో చేయి కోసుకుని అక్కడే పడిపోయాడు. స్థానికులు చూసి రవితేజను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. వీఆర్‌వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు.. ఎస్ఐ టి.శ్రీరాం వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)