AP Budget 2025 : వార్షిక బడ్జెట్‌పై కసరత్తు వేగవంతం.. కీలక శాఖలకు భారీగా కేటాయింపులు!
AP Budget 2025 : కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. పూర్తిస్థాయి బడ్దెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. కసరత్తు ముమ్మరం చేశారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చలు ప్రారంభించారు. పలు శాఖల కార్యదర్శుల స్థాయిలో చర్చలు ముగిశాయి. మంత్రులతో పయ్యావుల కేశవ్ చర్చలు జరుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌పై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత మేర బడ్జెట్ కేటాయింపులున్నాయి, పది నెలల్లో చేసిన ఖర్చు ఎంత? ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎంత ఖర్చు చేయగలరు అనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ శాఖల వారీగా మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
మంత్రులతో చర్చలు..
ఇప్పటివరకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎక్సైజ్ శాఖమంత్రి కొల్లు రవీంద్ర, సాంఘీక సంక్షేమ శాఖమంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, మైనార్టీ సంక్షేమ శాఖమంత్రి ఫరూక్‌తో పయ్యావుల కేశవ్ సమావేశమయ్యారు. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై చర్చించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ ఈ సమావేశాల్లో కీలకంగా వ్యవహరించారు.
ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలు..
కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఏయే శాఖలకు ఎంత నిధులు కేటాయించాలన్న అంశాలపై చర్చలు జరిగినట్టు తెలిసింది. ముఖ్యంగా జలవనరుల శాఖకు సంబంధించి ఎంత నిధులు అవసరమో మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్థిక శాఖకు వివరించారు. హంద్రినివా, వెలిగొండ, చింతలపూడి ఎత్తిపోతల వంశధారా, గాలేరు- నగరి తోపాటు.. ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని రామానాయుడు కోరినట్టు సమాచారం. అటు పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర నుంచి నిధులు వస్తాయన్న అంచనాతో దీనికి కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది.
10 శాతం పెంచాలి..
ఇక సాంఘీక సంక్షేమ శాఖకు సంబంధించి గత బడ్జెట్‌లో రూ.18 వేల కోట్లు కేటాయించారు. ఈసారి మరికొంత పెంచాలని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి కోరినట్టు తెలిసింది. మహిళా శిశు సంక్షేమ శాఖకు గత బడ్జెట్‌లో రూ.4100 కోట్లు కేటాయించారు. గిరిజన సంక్షేమానికి రూ.రూ.4500 కోట్లు కేటాయించారు. ఈసారి బడ్జెట్‌లో 10 శాతం మేర పెంచాలని మంత్రి సంధ్యారాణి కోరారు.