AP Power Charges: ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచినా డిస్కంలకు ఒరిగిందేమి లేదన్న గొట్టిపాటి-gottipati said that despite the increase in electricity charges in ap nothing has happened to the discoms ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Power Charges: ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచినా డిస్కంలకు ఒరిగిందేమి లేదన్న గొట్టిపాటి

AP Power Charges: ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచినా డిస్కంలకు ఒరిగిందేమి లేదన్న గొట్టిపాటి

Bolleddu Sarath Chandra HT Telugu
Aug 27, 2024 04:04 PM IST

AP Power Charges: డిస్కంల పేరు చెప్పి జగన్ విద్యుత్ చార్జీలు పెంచినా.. డిస్కంలకు ఒరిగింది ఏమీ లేదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. అంతేగాకుండా వైసీపీ హయాంలో అప్పులు 79 శాతం పెరిగినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం అప్పు తెస్తే కానీ నడపలేని స్థితిలో డిస్కంలు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు.

అప్పులు చేస్తే తప్ప నడవలేని స్థితిలో ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు
అప్పులు చేస్తే తప్ప నడవలేని స్థితిలో ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు

AP Power Charges: జగన్ మోహన్ రెడ్డి పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో కాలంలో డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయని ఆరోపించారు.

డిస్కంల అప్పులు పేరు చెప్పి కరెంటు బిల్లులు పెంచి జగన్ రెడ్డి ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు. నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో ఒక్కసారి కూడా కరెంట్ బిల్లులను పెంచింది లేదని అన్నారు. అయితే జగన్ రెడ్డి మాత్రం ఐదేళ్ల కాలంలో 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారని దుయ్యబట్టారు.

డిస్కంల పేరు చెప్పి జగన్ విద్యుత్ చార్జీలు పెంచినా.. డిస్కంలకు ఒరిగింది ఏమీ లేదని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. అంతేగాకుండా వైసీపీ హయాంలో అప్పులు 79 శాతం పెరిగినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం అప్పు తెస్తే కానీ నడపలేని స్థితిలో డిస్కంలు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు.

గత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీలు, ఇతర మొత్తాలు కలిపి ఇప్పటికి రూ.34,954 కోట్లను బకాయిలుగా ఉన్నాయని తెలిపిన మంత్రి వైసీపీ ఏలుబడిలో డిస్కంల అప్పులు కట్టడానికి మళ్లీ మళ్లీ అప్పులు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఉన్న పరిస్థితిని మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి రవి కుమార్ పేర్కొన్నారు.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. వాటి పని తీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రేటింగ్ లో కూడా మన డిస్కంలు ‘ఏ’ నుంచి బీ,సీ,డీ కేటగిరిలకు పడిపోయినట్లు గుర్తు చేశారు.

రేటింగ్ పడిపోవడంతో అప్పులపై వడ్డీ రేటు కూడా పెరిగిందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా చంద్రబాబు నాయుడు విధానపరమైన నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరులో ‘ఏ’ రేటింగ్ ఉండేవని గుర్తు చేశారు. విభజన సమయంలో ఏపీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని.. సవాళ్లు మనకు కొత్తేమీ కాదని అన్నారు.

విద్యుత్ వ్యవస్థను పటిష్ఠం చేయడంలో చంద్రబాబు నాయుడు కు మంచి ట్రాక్ రికార్డ్ ఉందని చెప్పారు. సీఎం ఇప్పుడు విద్యుత్ పై ప్రత్యేక శ్రధ్ద పెట్టినట్లు తెలిపారు. త్వరలోనే అప్పులను తగ్గించి, డిస్కంలను గాడిలో పెట్టేలా చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వ రేటింగ్ ల్లో ఏ ప్లస్ కోసం తాము ఆరాటపడమని తెలిపిన ఆయన, మా పనికి తగ్గ ఫలితాలు రానున్న రోజుల్లో ప్రజలు చూస్తారని వివరించారు. ఎట్టి పరిస్థితిల్లో కూడా ప్రజల మీద అధిక భారం వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రజలపై విద్యుత ఛార్జీల భారం మోపకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.