విశాఖలో అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌ - 10 బిలియన్ డాలర్లతో పెట్టుబడి..!-google to invest usd 10 billion in visakhapatnam for asia largest data centre cluster ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విశాఖలో అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌ - 10 బిలియన్ డాలర్లతో పెట్టుబడి..!

విశాఖలో అతిపెద్ద గూగుల్‌ డేటా సెంటర్‌ - 10 బిలియన్ డాలర్లతో పెట్టుబడి..!

విశాఖపట్నంలో గూగుల్‌ సంస్థ అతి పెద్ద డేటా సెంటర్‌ ను ఏర్పాటు చేయనుంది. ఆసియాలోనే అతిపెద్ద డేటా కేంద్రంగా ఇది ఉండనుంది. దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా గూగుల్ యూఎస్డీ 10 బిలియన్లను (సుమారు రూ. 84 వేల కోట్లు) విశాఖపట్నం కేంద్రంగా పెట్టుబడి పెట్టనుంది.

గూగుల్ డేటా సెంటర్

ఏపీలో విశాఖపట్నం డేటా సెంటర్లకు అతిపెద్ద కేంద్రంగా మారనుంది. ఇందులో భాగంగా గూగుల్ సంస్థ… భారీస్థాయిలో పెట్టుబడి పెట్టెందుకు యోచిస్తోంది. విశాఖపట్నం కేంద్రంగా ఒక గిగావాట్ డేటా సెంటర్ క్లస్టర్ ను అభివృద్ధి చేయనుంది. మొత్తం 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ .88,730 కోట్లు) పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం…ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతలో సచివాలయంలో నిర్వహించిన 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.

దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా గూగుల్… యూఎస్డీ 10 బిలియన్లను (సుమారు రూ. 84 వేల కోట్లు) విశాఖపట్నం కేంద్రంగా పెట్టుబడి పెట్టనుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌గా గుర్తింపు పొందనుంది. ఈ సెంటర్ ఏర్పాటుతో భారీస్థాయిలో ఉద్యోగావకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది.

విశాఖలోని తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం సమీపంలోని రాంబిల్లి వద్ద మూడు క్యాంపస్‌లలో ఈ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తారు. విశాఖకు రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు అనుసంధానంగా ఈ క్యాంపస్‌లు ఏర్పాటు కానున్నాయి.

క్వాంటం వ్యాలీ తరహాలోనే డేటా సెంటర్లు ఏపీకి టెక్నాలజీ గేమ్ చేంజర్‌గా మారతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కేవలం 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. డేటా సెంటర్లతో ఓ ఎకో సిస్టం వస్తోందని.. విశాఖ నగరం తదుపరి స్థాయి ఏఐ సిటీగా మారుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.

అమెరికాలో వర్జీనియా నగరం డేటా వ్యాలీగా ఉందని.. ప్రస్తుతం విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. టీసీఎస్ సంస్థ కూడా ఇక్కడ త్వరలోనే క్యాంపస్‌ను ప్రారంభించనుందని.. ఒక్క విశాఖ నగరంలోనే 5 లక్షల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. ఐటీ సంస్థలు, అందులో పనిచేసే ఉద్యోగులకు హౌసింగ్‌తో పాటు రహదారులు, ఇతర మౌలిక వసతులు ఉండేలా ప్రణాళికలు చేయాలని సూచించారు.

డేటా సెంటర్ ఏర్పాటు ఆధునిక ఆర్థిక మౌలిక సదుపాయాలకు మూలస్తంభంగా పనిచేస్తుంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ, 5జీ మరియు ఇ-గవర్నెన్స్ ప్లాట్ ఫామ్స్ ను మరింత వేగవంతం చేస్తుంది. ఇది విద్యుత్, ఫైబర్ ఆప్టిక్స్, రియల్ ఎస్టేట్ మరియు టెలికమ్యూనికేషన్స్ వంటి అనుబంధ రంగాలకు మద్దతుగా నిలుస్తుంది.

డేటా సెంటర్ల ఏర్పాటుతో అంతర్జాతీయంగా డేటా సెంటర్ల సామర్థ్యంలో ఏపీ టాప్‌గా నిలవనుంది. విశాఖలో రెండు గిగావాట్లతో కూడిన డేటా సెంటర్ ఏర్పాటుకు టీసీఎస్ ముందుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనితో పాటు తాజాగా గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫో ఒక గిగావాట్‌ తో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతుంది. ఫలితంగా విశాఖపట్నం అతిపెద్ద డేటా సెంటర్లకు కేరాఫ్ గా నిలవనుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం