ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి.. విశాఖలో అడుగుపెడుతున్న గూగుల్.. కీలక ఒప్పందం!-google announces ai hub in visakhapatnam will invest 15 billion in 5 years ap govt key agreement with google ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి.. విశాఖలో అడుగుపెడుతున్న గూగుల్.. కీలక ఒప్పందం!

ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి.. విశాఖలో అడుగుపెడుతున్న గూగుల్.. కీలక ఒప్పందం!

Anand Sai HT Telugu

రాబోయే ఐదు సంవత్సరాలలో విశాఖపట్నంలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. భారీ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్‌ను ఏర్పాటు చేయనుంది.

గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్‌ను ఏర్పాటు చేయనుంది గూగుల్. రాబోయే ఐదు సంవత్సరాలలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ మంగళవారం తెలిపింది. ఇది అమెరికా వెలుపల దాని అతిపెద్ద ఏఐ హబ్. ఢిల్లీలో భారత్ ఏఐ శక్తి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో గూగుల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

'ఇది అమెరికా వెలుపల మేం పెట్టుబడి పెట్టే అతిపెద్ద ఏఐ హబ్.' అని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ అన్నారు.

విశాఖపట్నంలో 1-గిగావాట్ డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మిస్తుంది గూగుల్. ఏఐ మౌలిక సదుపాయాల బేస్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

'ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్‌ విశాఖలో అడుగుపెడుతోంది. అప్పుడు హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీని అభివృద్ధి చేశాం. ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నాం. ఆనాడు హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాం. ప్రస్తుతం విశాఖకు గూగుల్‌ తెస్తున్నాం. సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఏఐ, రియల్ టైమ్ డేటా కలెక్షన్లు అవసరం.' అని చంద్రబాబు అన్నారు.

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందుగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ మన లక్ష్యమన్నారు. స్మార్ట్ వర్క్ నినాదాన్ని ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఐదు సంవత్సరాలలో గూగుల్ 15 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టడం సంతోషదాయకమన్నారు.

ఈ ప్రాజెక్టుతో వైజాగ్ ఏఐ సిటీగా మారనుంది. ఆసియాలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న పెద్ద ప్రాజెక్టు ఇది. దీనితో 2028-32 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10 వేల కోట్లకుపైగా సమకూరుతుందని, 1,88,220 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. గూగుల్‌ క్లౌడ్‌ ఆధారిత కార్యక్రమాలతో ప్రతీ ఏటా.. రూ.9,553 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.47,720 కోట్ల ఉత్పాదకత జరుగుతుందంటున్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.