AP SADAREM Slots : దివ్యాంగుల‌కు గుడ్‌న్యూస్‌, ఏప్రిల్ 1 నుంచి 'సదరం' స్లాట్లు- అవ‌స‌ర‌మైన ప‌త్రాలివే-good news for the disabled sadaram slots from april 1 the necessary documents are ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Sadarem Slots : దివ్యాంగుల‌కు గుడ్‌న్యూస్‌, ఏప్రిల్ 1 నుంచి 'సదరం' స్లాట్లు- అవ‌స‌ర‌మైన ప‌త్రాలివే

AP SADAREM Slots : దివ్యాంగుల‌కు గుడ్‌న్యూస్‌, ఏప్రిల్ 1 నుంచి 'సదరం' స్లాట్లు- అవ‌స‌ర‌మైన ప‌త్రాలివే

HT Telugu Desk HT Telugu

AP SADAREM Slots : ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పింఛన్లు, ఇతర రాయితీలకు కీలకమైన సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి సదరం స్లాట్లను పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దివ్యాంగుల‌కు గుడ్‌న్యూస్‌, ఏప్రిల్ 1 నుంచి 'సదరం' స్లాట్లు- అవ‌స‌ర‌మైన ప‌త్రాలివే

AP SADAREM Slots : దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛ‌న్ల త‌నిఖీ కోసం కొంతకాలంగా నిలిపివేసిన సదరం స్లాట్లను ఏప్రిల్ 1 నుంచి పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన అన్ని ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో ప్రతి మంగళవారం స్లాట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. పరీక్షల అనంతరం అర్హులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామని పేర్కొంది.

రాష్ట్రంలో కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత దివ్యాంగ పెన్షన్ల వెరిఫికేషన్ నిర్వహించింది. దీంతో జ‌న‌వ‌రిలో విడుద‌ల కావ‌ల్సిన స‌ద‌రం స్లాట్‌లు నిలిపివేశారు. దివ్యాంగ సంఘాల విజ్ఞప్తుల మేర‌కు, వెరిఫికేష‌న్‌తో పాటు స్లాట్‌ల‌ను తిరిగి ప్రారంభించాల‌ని నిర్ణయించిన‌ట్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్‌ ఎ.సిరి తెలిపారు. అర్హులైన దివ్యాంగుల‌కు స‌ర్టిఫికేట్లు అందిస్తామ‌ని పేర్కొన్నారు. ఈ స్టాట్‌లు ఎంపిక చేసిన ఏరియా, జిల్లా, టీచింగ్ ఆసుప‌త్రులు, గ‌వ‌ర్నమెంట్ జ‌న‌ర‌ల్ హాస్పటల్స్ (జీజీహెచ్‌)లో ప్రతి మంగ‌ళ‌వారం అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ సేవ‌లు అమ‌లులోకి వ‌స్తాయ‌ని పేర్కొన్నారు.

స్లాట్లు ఎక్కడ బుక్ చేసుకోవాలి?

సంద‌రం స‌ర్టిఫికెట్లు పొందేందుకు తొలుత స్లాట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీసేవ‌, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో స‌ద‌రం (వికలాంగుల ధ్రువీకరణ పత్రం) అడ్వాన్స్‌ స్లాట్ బుకింగ్ చేసుకోవ‌చ్చు. స్లాట్ తేదీ మొబైల్ నెంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వ‌స్తుంది. లేక‌పోతే స్లాట్ బుకింగ్ ర‌సీదులో ఉన్న స‌ద‌రం ఐడీను వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తే ప్ర‌స్తుతం స‌ద‌రం స్టేట‌స్ తెలుసుకోవ‌చ్చు. స‌ద‌రం స్లాట్ ఎక్కువ కాలం అందుబాటులో ఉండ‌వు క‌నుక అందుబాటులో ఉన్న స‌మ‌యంలోనే బుకింగ్ చేసుకోవాలి. గతంలో సదరం స్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పుడు స్లాట్ అలాట్మెంట్ అయ్యే అవ‌కాశం ఉంది. రాష్ట్రంలో ఎంపిక చేసిన ఆసుప‌త్రుల్లో ఏప్రిల్ 1 నుంచి వైద్య ప‌రీక్షలు ప్రారంభం కానున్నాయి.

స‌ద‌రం స‌ర్టిఫికెట్ వీరికే

శారీర‌క వైక‌ల్యం, మానసిక లోపాలు, కంటిచూపు లోపం వంటి ఇత‌ర లోపాల‌తో బాధ‌ప‌డే వారికి వైక‌ల్యాన్ని నిర్ధారిస్తూ అందించేదే స‌ద‌రం స‌ర్టిఫికేట్‌. ఈ స‌ర్టిఫికేట్‌ను ఆధారంగా తీసుకునే ప్రభుత్వం పెన్షన్‌, ఇత‌ర దివ్యాంగు కోటా సంక్షేమ ప‌థ‌కాల‌ను అందిస్తోంది. క‌నుక ప్రతి ఒక్క దివ్యాంగుడు ఈ స‌దరం స‌ర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. అప్పుడే ఆయ‌న అన్ని ర‌కాల పథ‌కాలు, రాయితీలు వ‌ర్తిస్తాయి. సద‌రం స‌ర్టిఫికేట్ లేని దివ్యాంగుడు ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు, రాయితీల‌కు అన‌ర్హుడుగా గుర్తిస్తారు.

స‌ద‌రం స‌ర్టిఫికేట్‌ను ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేటు వైద్యులు కాకుండా, ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో వివిధ ర‌కాల కొల‌మానాల ప్రకారం అందిస్తారు. ఏదైనా ప్ర‌మాదం జ‌రిగి అవ‌యవాలు కోల్పోయిన వారికి ఆర్థో, అంధ‌త్వం, వినికిడి, మానసిక రుగ్మత‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి ప్రభుత్వం స‌ద‌రం సర్టిఫికెట్ జారీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజ‌ర్వేష‌న్‌, రాష్ట్ర, కేంద్ర ర‌వాణా సంస్థలైన ఆర్టీసీ బ‌స్సులు, రైళ్లలో ప్రయాణ చార్జీల్లో రాయితీలు, ఉచిత ప్రయాణం, చిన్న ప‌రిశ్రమ స్థాప‌న‌కు రుణాలు, స‌బ్సిడీకి సంద‌రం స‌ర్టిఫికేట్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతోంది.

స్లాట్ బుక్ చేసుకునేందుకు ఈ ప‌త్రాలు అవ‌స‌రం

స్లాట్ పొందేందుకు మీసేవ, గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ఆధార్‌, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, వ‌య‌స్సు, లింగం, వైవాహిక స్థితి, కులం, మ‌తం స‌హా విద్యార్హ‌త‌, అలాగే రేష‌న్ కార్డు నంబ‌ర్ కూడా న‌మోదు చేయాల్సి ఉంటుంది. ఆ త‌రువాత ఆసుప‌త్రి, తేదీ, స‌మ‌యం కేటాయిస్తు ఫోన్‌కు మెసేజ్ వ‌స్తుంది. కేటాయించిన తేదీ, స‌మ‌యానికి ఆ ఆసుప‌త్రికి వెళ్లాలి. ప్రభుత్వ ఆసుప‌త్రిల్లో నిర్వహించే శిబిరాల్లో వైద్యులు ప‌రీక్షించి వైక‌ల్యం నిర్ధారించి ధ్రువ‌ప‌త్రం అంద‌జేస్తారు. స‌ర్టిఫికేట్ ఉన్నవారు పున‌రుద్ధ‌రించుకునేందుకు (రెన్యువ‌ల్) కూడా స్లాట్‌ అవ‌స‌రం ఉంటుంది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వరరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

HT Telugu Desk

సంబంధిత కథనం