PH Railway Pass: వికలాంగుల‌కు గుడ్‌న్యూస్‌, ఇక ఆన్‌లైన్‌లోనే రైల్వే పాస్‌లు జారీ... దరఖాస్తు చేయడం ఇలా-good news for the disabled railway passes can now be issued online ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ph Railway Pass: వికలాంగుల‌కు గుడ్‌న్యూస్‌, ఇక ఆన్‌లైన్‌లోనే రైల్వే పాస్‌లు జారీ... దరఖాస్తు చేయడం ఇలా

PH Railway Pass: వికలాంగుల‌కు గుడ్‌న్యూస్‌, ఇక ఆన్‌లైన్‌లోనే రైల్వే పాస్‌లు జారీ... దరఖాస్తు చేయడం ఇలా

HT Telugu Desk HT Telugu
Published Feb 12, 2025 01:50 PM IST

PH Railway Pass: వికలాంగులకు ఇండియ‌న్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి రైల్వే స్టేష‌న్ల‌ చుట్టూ కాళ్లు అరిగేలా తిర‌గ‌న‌వ‌స‌రం లేదు. ఆన్‌లైన్‌లోనే దివ్యాంగుల‌కు రైల్వే పాస్‌లు మంజూరు చేయ‌నున్నారు. కంప్యూట‌ర్ ఉంటే చాలు వికలాంగుల రైల్వే పాస్ చేతికి వ‌చ్చేస్తుంది.

దివ్యాంగులకు ఇకపై ఆన్‌లైన్‌లో పాస్‌ల జారీ
దివ్యాంగులకు ఇకపై ఆన్‌లైన్‌లో పాస్‌ల జారీ

PH Railway Pass: శారీరక వైకల్యం బాధపడే వారికి రైల్వే పాస్‌ జారీలో నిబంధనలు సడలించారు. పాస్‌ కోసం రైల్వే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే రైల్వే పాసులు పొందే వెసులుబాటును ఇండియన్ రైల్వే క‌ల్పించిన‌ట్లు చిత్తూరు జిల్లా రైల్వే శాఖ అధికారి వెంక‌టేష్ తెలిపారు.

ఇంట‌ర్ నెట్ కేంద్రాల్లో లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకునే సౌల‌భ్యం రైల్వే శాఖ క‌ల్పించింది. లేక‌పోతే సొంత కంప్యూట‌ర్ ఉంటే, ఇంటి వ‌ద్ద నుంచే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

రాష్ట్రంలో దివ్యాంగు పెన్ష‌న్లు పొందుతున్న‌వారు 7,87,976 మంది ఉన్నారు. అంటే దాదాపుగా దివ్యాంగులు కూడా అంతే మంది ఉంటారు. వీరు రైల్వే పాస్ పొందేందుకు అర్హులు. వీరంతా ఇప్పుడు రైల్వే కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన ఆన్‌లైన్‌లో రైల్వే పాస్ పొందే విధానాన్ని వినియోగించుకోవచ్చు. దీనివ‌ల్ల దివ్యాంగుల‌కు స‌మ‌య‌భావ స‌మ‌స్య ఉండ‌దు. అలాగే సుదూర ప్రాంతాల‌కు వెళ్ల‌న‌వ‌స‌రం లేదు. పెద్ద‌గా డ‌బ్బులు కూడా ఖ‌ర్చు కావు.

యూడీఐడీ కార్డు మంజూరు

అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://divyangjanid.indianrail.gov.in/ లోకి వెళ్లి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇందులోనే యూనిక్ డిజిబులిటీ ఐడీ కార్డు (యూడీఐడీ) మంజూరు చేస్తారు. కొత్త పాసులు కావాల్సిన వారు పాత‌వి రెన్యూవ‌ల్ చేయాల‌నుకునేవారు ఇందులో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఇప్ప‌టికే ఈ వెబ్‌షైట్ అందుబాటులోకి వ‌చ్చింది.

ఇలా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి

తొలిత అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://divyangjanid.indianrail.gov.in/ క్లిక్ చేయాలి. అప్పుడు దివ్యాంగులు ఓటీపీ ఆధారంగా ఆన్‌లైన్‌లోనే పాసు ఐడీ కార్డు తీసుకోవ‌చ్చు. కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యంలో తొలుత త‌న పేరు, ఆధార్ కార్డు నెంబ‌ర్‌, ఫోన్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేసి రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ అయిన త‌రువాత ఫోన్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి. త‌రువాత వ‌చ్చిన ఓటీపీ నెంబ‌ర్‌ను ఎంట‌ర్ చేసి లాగిన్ అవ్వ‌లి. ఎన్నిసార్లు లాగిన్ అయినా పేర్లు రిజిస్ట‌ర్ చేసుకునే వెసులుబాటు క‌ల్పించారు.

ఇది వ‌ర‌కు రైల్వే స్టేష‌న్ల‌లోనే పాస్‌లు మంజూరు చేసేవారు. అది కూడా పెద్ద రైల్వే స్టేష‌న్ల‌లోనే దివ్యాంగుల‌కు పాస్‌లు ఇచ్చేవారు. దీంతో దివ్యాంగులు ఏటా రైల్వే పాస్‌ల కోసం సుదూర ప్రాంతాల‌కు వెళ్లాల్సి వ‌చ్చేది. దీంతో దివ్యాంగుల‌కు చాలా క‌ష్ట‌తరంగా ఉండేది. ఇప్పుడు కొత్త‌గా తీసుకొచ్చిన ఈ విధానాన్ని దివ్యాంగులు ఆహ్వానిస్తున్నారు. ఇదొక శుభ ప‌రిణామ‌మ‌ని దివ్యాంగులు తెలుపుతున్నారు. ఇంటి వ‌ద్ద నుంచే పాస్‌లు పొందే విధానం ప‌ట్ల‌ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner