AP Power Subsidy: చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. చేనేత కార్మికుల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనుంది. అలాగే పవర్‌లూమ్ యూనిట్ల (మర మగ్గాలు)కు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనుంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది.
చేనేత కార్మికులు, చేనేత రంగాల ప్రయోజనాలను కాపాడటం పట్ల ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడంలోని భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ హామీ అమలు కోసం విద్యుత్ శాఖ అవసరమైన బడ్జెట్ మద్దతును అందిస్తుందని తెలిపింది.
చేనేత కార్మికుల ఉచిత విద్యుత్ అందించే ఉత్తర్వులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ జీవోనెంబర్ 44 విడుదల చేశారు. 2018 సెప్టెంబర్ 25న నాటి పరిశ్రమలు, వాణిజ్య శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 291 ప్రకారం రాష్ట్రంలోని చేనేత కార్మికులకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
2001 అక్టోబర్ 12 నాటి పరిశ్రమలు, వాణిజ్య శాఖ విడుదల చేసిన జీవో 518 ప్రకారం 2001 అక్టోబర్ 1 నుండి పవర్‌లూమ్ యూనిట్లకు విద్యుత్ సుంకాన్ని యూనిట్‌కు రూ.1.74 నుండి రూ.0.87కి తగ్గించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
2013 డిసెంబర్ 4 నాటి పరిశ్రమలు, వాణిజ్య శాఖ విడుదల చేసిన జీవో 691 ప్రకారం రాష్ట్రంలోని పవర్‌లూమ్ నేత కార్మికులకు 2010 ఏప్రిల్ 1 నుండి 2012 మార్చి 31-03-2012 వరకు, అలాగే 2012 ఏప్రిల్ 1 తర్వాత కూడా 50 శాతం విద్యుత్ సబ్సిడీ పథకాన్ని కొనసాగించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
2024 ఫిబ్రవరి 22 నాటి విద్యుత్ శాఖ విడుదల చేసిన జీవో 31 ప్రకారం పవర్‌లూమ్ నేత కార్మికులపై అదనపు భారాన్ని తగ్గించడానికి పవర్‌లూమ్ నేత కార్మికులకు విద్యుత్ సుంకాన్ని యూనిట్‌కు రూ.1.00 నుండి యూనిట్‌కు 0.06 పైసలకు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలోని వ్యవసాయం తరువాత రెండో అతిపెద్ద ఉపాధి అందించేది చేనేత రంగమని ప్రభుత్వం పేర్కొంటుంది. రాష్ట్రంలో దాదాపు 93,000 చేనేత నేత కుటుంబాలు, 10,534 పవర్‌లూమ్ యూనిట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత పరిశ్రమ దాదాపు అన్ని జిల్లాల్లో విస్తరించి ఉంది.
కేంద్ర ప్రభుత్వం "ఒక జిల్లా ఒక ఉత్పత్తి" కార్యక్రమంలో 98 ఉత్పత్తులను గుర్తించగా, అందులో 34 ఉత్పత్తులు చేనేత రంగానికి చెందినవే. ఇది చేనేత గొప్ప ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. రాష్ట్రంలో చేనేత నేయడం చారిత్రాత్మకంగా బహుళ తరాల వృత్తి, కుటుంబ సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వంలో లోతుగా పాతుకుపోయింది. అయితే, ముడిసరుకు, రంగులు, రసాయనాల ఖర్చులు విపరీతంగా పెరగడం, ఓవర్ హెడ్ ఖర్చులు పెరగడం వల్ల చేనేత వారసత్వం గణనీయమైన ముప్పును ఎదుర్కొంటోంది.
దీనివల్ల ఇతర రంగాలతో పోలిస్తే వేతనాలు తగ్గుతాయి. సామాజిక భద్రతా ప్రయోజన పథకంలోని ఇతర అర్హత కలిగిన వర్గాలతో సమానంగా చేనేతలకు అందించింది. ప్రభుత్వం 2024 ఏప్రిల్ నుండి చేనేత కార్మికుల నెలవారీ పెన్షన్‌ను నెలకు 3,000 నుండి 4,000కి పెంచింది. ఇది కొంత ఉపశమనం అందించడానికి ఉపయోగపడింది.
ఈ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, చేనేత కార్మికులు, వారి రంగాల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయడానికి సిద్ధపడింది. ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత, జౌళి శాఖ కమిషనర్ సుమారు 93,000 చేనేత కార్మికుల కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును, సుమారు 10,534 పవర్‌లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించడానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు.
దీనివల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి సుమారు రూ.125 కోట్ల ఆర్థిక భారం పడుతుంది. ఈ పథకాన్ని సజావుగా అమలు చేయడానికి డిస్కామ్‌లకు అయ్యే ఖర్చును తిరిగి పొందడానికి విద్యుత్ శాఖకు అవసరమైన బడ్జెట్‌ను మంజూరు చేయాలని కూడా ప్రతిపాదించారు.
చేనేత కార్మికుల కుటుంబం 200 యూనిట్ల వినియోగం కంటే ఎక్కువగా ఉండి, పవర్‌లూమ్ యూనిట్ 500 యూనిట్లను మించి ఉంటే, మించిపోయిన యూనిట్లకు డిస్కామ్‌ల నియమాలు/నిబంధనల ప్రకారం ఛార్జీలు వర్తిస్తాయి. ఈ ప్రతిపాదనను పరిశీలించిన తరువాత చేనేత కార్మికుల కుటుంబాలకు, పవర్‌లూమ్ యూనిట్లకు ఉచిత విద్యుత్తును అందించడానికి ప్రభుత్వం అంగీకరించింది. చేనేత కార్మికులు, వారి రంగాల ప్రయోజనాలను కాపాడేందుకు విద్యుత్ శాఖ అవసరమైన బడ్జెట్ మద్దతును అందిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (ఎస్‌వోపీ) విద్యుత్ శాఖతో సంప్రదించి ఆమోదం పొందిన తరువాతనే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో అవసరమైన చర్యలను చేనేత, జౌళి కమిషనర్ తీసుకుంటారని పేర్కొన్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం