AP Farmers Subsidies : ఏపీ సూక్ష్మ, బిందు సేద్యం రైతులకు గుడ్ న్యూస్-సబ్సిడీలు ఖరారు చేసిన ప్రభుత్వం
AP Farmers Subsidies : ఏపీ ప్రభుత్వం సూక్ష్మ, బిందు సేద్యం సబ్సిడీలు ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ప్రకారం రైతులకు డ్రిప్, స్పింక్లర్లపై సబ్సిడీని అందిస్తుంది. 5 ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్సీ రైతులకు 100 శాతం సబ్సిడీపై పరికరాలు అందిస్తారు.

AP Farmers Subsidies : రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద 2025-26కు సంబంధించి సబ్సిడీలు ఖరారయ్యాయి. సూక్ష్మ, బిందు సేద్యం చేసే రైతులకు డ్రిప్, స్పింక్లర్ల సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఎస్సీ, ఎస్టీల్లో చిన్న, మధ్యస్థ రైతులకు 5 ఎకరాల వరకు 100 శాతం, ఇతర చిన్న, మధ్యస్థ రైతులకు 90 శాతం, రాయలసీమ, ప్రకాశం జిల్లాల మధ్యస్థ రైతులు, ఐటీడీఏ పరిధిలో 5-10 ఎకరాల ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ ఖరారు చేశారు.
కోస్తాంధ్ర జిల్లాల్లో 5-10 ఎకరాల మధ్యస్థ రైతులకు 70 శాతం, పెద్ద రైతులకు 50 శాతం సబ్సిడీకి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించనున్నారు. స్పింక్లర్లపై అన్ని కేటగిరీల రైతులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. ఈ సబ్సిడీలో 27 నుంచి 33 శాతం కేంద్ర ప్రభుత్వం, 17 నుంచి 67 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉత్తరుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సబ్సిడీలు ఇలా
- 5 ఎకరాలలోపు ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్న కారు రైతులకు 100 శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు
- ఎస్సీ, ఎస్టీయేతర చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ (గరిష్టంగా రూ.2.18 లక్షల వరకు)
- రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5-10 ఎకరాల్లోపు రైతులు, గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ (రూ.3.14 లక్షల వరకు)
- కోస్తా జిల్లాల్లో 5-10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం సబ్సిడీ (రూ.3.10 లక్షలు వరకు),
- కోస్తా జిల్లాల్లో 10 ఎకరాలకు పైబడిన రైతులకు 50 శాతం సబ్సిడీ(రూ.4లక్షలు)
ఇతర సామాజిక వర్గాలకు సబ్సిడీపై పరికరాలు
డ్రిప్ పరికరాల కోసం దరఖాస్తు చేసే అన్ని సామాజిక వర్గాలకు చెందిన రైతులకు 5 ఎకరాల లోపు చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం (రూ.19 వేలు), 12.5 ఎకరాల్లోపు ఇతర సామాజిక వర్గాలకు చెందిన రైతులకు 50 శాతం (రూ.19వేలు) చొప్పున సబ్సిడీ అందించనున్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో 2.05 లక్షల ఎకరాలను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తీసుకొచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ సర్వేలో తెలిసింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రైతులకు సబ్సిడీ రూపంలో రూ.793.67 కోట్లు ఆర్థిక సాయం అందించింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 75,035 మంది రైతులు సబ్సిడీ ప్రయోజనం పొందారు. 2023–24లో సూక్ష్మ సేద్యంలో దేశంలోని టాప్ 20 జిల్లాల్లో ఏపీ నుంచి ఐదు జిల్లాలు ఉన్నాయి. అనంతపురం, ప్రకాశం, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయని సర్వే తెలిపింది.
సంబంధిత కథనం