Srikakulam Gold missing: బ్యాంకులో బంగారం మాయం.. ఆత్మహత్య చేసుకున్న మేనేజర్-gold mortgaged in the bank was lost bank manager committed suicide ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Gold Mortgaged In The Bank Was Lost, Bank Manager Committed Suicide

Srikakulam Gold missing: బ్యాంకులో బంగారం మాయం.. ఆత్మహత్య చేసుకున్న మేనేజర్

Sarath chandra.B HT Telugu
Dec 01, 2023 07:55 AM IST

Srikakulam Gold missing: బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారానికి రెక్కలు వస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం ఎస్బీఐలో 7కేజీల బంగారం మాయమవగా, బ్యాంకు అధికారి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.

బ్యాంకులో తనఖా పెట్టిన బంగారం మాయం
బ్యాంకులో తనఖా పెట్టిన బంగారం మాయం

Srikakulam Gold missing: ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారానికి రెక్కలు వచ్చాయి. రుణాలు తీర్చినా బంగారం మాత్రం ఖాతాదారుల చేతికి అందలేదు. ఖాతాదారుల ఆందోళనతో ఆరా తీసిన అధికారులకు 7కిలోల బంగారం లెక్కలు దొరకలేదు. ఈ క్రమంలోనే గోల్డ్ కస్టోడియన్‌ విధుల్లో ఉన్న మహిళా అధికారి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. విధిలేని పరిస్థితుల్లో దాదాపు రూ.4కోట్ల రుపాయల విలువైన బంగారం మాయమైనట్లు పక్షం రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

శ్రీకాకుళం జిల్లా గార ఎస్‌బీఐలో బంగారం గల్లంతు వ్యవహారంలో అదే బ్రాంచిలో పనిచేస్తున్న ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గారలోని స్టేట్‌ బ్యాంక్‌ శాఖలో ఖాతాదారులు కుదువ పెట్టిన 7 కేజీల బంగారు ఆభరణాలు గల్లంతయ్యాయి.

ఇంటి దొంగల పనిగా గుర్తించిన ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణకు ముందే బ్యాంకులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది.

గార ఎస్‌బీఐ బ్రాంచిలో ఆభరణాలు కుదువ పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారులు అప్పులు తీర్చిరా నగలు తిరిగి ఇవ్వకపోవడంతో కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నగలు గల్లంతయ్యాయనే ప్రచారంతో నవంబరు 27న ఖాతాదారులు బ్యాంకులో ఆందోళనకు దిగారు.

ఈ నేపథ్యంలో శ్రీకాకుళం రీజినల్ మేనేజర్ ఆడిట్‌ కారణంగా జాప్యం జరుగుతోందని.. వదంతులు నమ్మవద్దని నచ్చ జెప్పారు. డిసెంబరు 8 వరకు వేచి ఉండాలని ఈలోపు ఆభరణాలకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకులో ఆడిట్ జరుగుతున్న సమయంలోనే గోల్డ్‌ లోన్స్‌ బాధ్యతలు చూసే డిప్యూటీ మేనేజరు స్వప్నప్రియ (39) నవంబరు 29న ఆత్మహత్యకు పాల్పడడం వెలుగు చూసింది. దీంతో బంగారం పక్కదారి పట్టడంతోనే ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంలో ఉద్యోగుల ప్రమేయం ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

దీంతో మరోసారి ఖాతాదారులు ఆందోళనకు దిగారు. బ్యాంకులో నగలు మాయమైనట్లు అంతర్గత విచారణలో గుర్తించినా అధికారులు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. బంగారం గల్లంతు వ్యవహారంలో స్వప్నప్రియను బాధ్యురాలిని చేస్తూ నవంబర్ 20 నుంచి సెలవుపై పంపారు. ఆ తరువాత రెండుసార్లు విచారణకు పిలిపించారు. డిసెంబర్ 8లోగా బంగారం అప్పగిస్తామని ఖాతాదారులకు చెబుతూ వచ్చారు.

ఈ క్రమంలో ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడడంతో విధిలేని పరిస్థితుల్లో గురువారం పోలీసులను ఆశ్రయించారు. బంగారం గల్లంతు వ్యవహారంలో బ్యాంకు ఉద్యోగుల పాత్రపై అనుమానం ఉందంటూ ఎస్‌బిఐ రీజినల్ మేనేజర్ రాజు, బ్రాంచి మేనేజర్ సీహెచ్‌.రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.4.07 కోట్ల విలువైన 7 కేజీల ఆభరణాలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.

WhatsApp channel