Godavari Special : గోదారోళ్లా మజాకా, ఎనిమిది అడుగుల విస్తరాకులో సకుటుంబ సపరివార భోజనం
Godavari Special : గోదారోళ్లంటే ఏటకారం తర్వాత గుర్తొచ్చేది ఆతిథ్యం. ఏకంగా ఎనిమిది అడుగుల ఒకే విస్తరాకులో సకుటుంబ సపరివారమంతా భోజనం చేశారు. అల్లుళ్ళు, కూతుర్లు, కుమారులు, కోడళ్లు ,మనవళ్ళకి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
Godavari Special : గోదారోళ్లు మామూలోళ్లుకాదు. ప్రత్యేకత వారిసొంతం. ఏకంగా ఎనిమిది అడుగుల ఒకే విస్తరాకులో సకుటుంబ సపరివారమంతా భోజనం చేశారు. గోదారోళ్లంటే ఆప్యాయతలు, పలకరింపులు మనకు గుర్తుకొస్తాయి. అంతేకాదు గోదారోళ్లు భోజనం పెట్టి చంపేస్తారని నానుడి ఉంది. మామూలుగానే భారీ స్థాయిలో భోజనాలు పెడతారు. మరి సంక్రాంతి లాంటి పండుగ సమయంలో అయితే, ఇంకా వెనకడుగు వేయరు.

అందులో భాగంగానే ఈ సంక్రాంతి పండుగకు కూడా కొత్త అల్లుళ్లకు 400 నుంచి 600 వరకు వెరైటీలతో విందులు ఏర్పాటు చేసి కొన్ని కుటుంబాలు వార్తాల్లోకి ఎక్కారు. మరోవైపు ఒకే భారీ విస్తరాకులో కుటుంబం మొత్తం భోజనం చేసి ప్రత్యేకంగా నిలిచారు. ఎనిమిది అడుగుల ఒకే విస్తరాకులో సకుటుంబ సపరివార సంక్రాంతి పండుగ సందర్భంగా భోజనం చేశారు.
సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టింది పేరు. అందులోనూ గోదావరి జిల్లాల్లో మరింత ప్రత్యేకంగా జరుపుకుంటారు. పందెం కోళ్లు ఒకవైపు, గుండాటలు, పేకాటలు వంటి జూద క్రీడలు మరోవైపు జోరుగా జరుగుతుంటాయి. అదంతా ఒక ఎత్తయితే సంక్రాంతికి మర్యాదలు చేయడంలో ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకత చాటుతారు.
అదే విధంగా కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన సియాదుల సోమేశ్వరరావు, సీతారత్నం ఇంట్లో ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాలలో స్థిరపడి సంక్రాంతి పండగకి ఇంటికి వచ్చిన అల్లుళ్ళు, కూతుర్లు, కుమారులు, కోడళ్లు ,మనవళ్ళకి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఎనిమిది అడుగుల విస్తరాకులో అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలతో వినూత్నంగా ఇంట్లోనే వండి భోజనం ఏర్పాటు చేశారు.
ముందుగా అల్లుళ్లకు వడ్డించి ఎనిమిది అడుగుల ఏకరీతి విస్తరాకుపై కుటుంబమంతా కలిసి భోజనం చేశారు. అల్లుళ్ళు, కూతుళ్లు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్లు ఒకే ఆకుపై ఒకరికొకరు తినిపించుకుంటూ ఆప్యాయతల మధ్య చక్కటి విందు ఆరగించారు. రసాయనాల రంగులతో రెడీమేడ్ ప్లేట్లు వాడుతున్న ఈ కాలంలో అతిపెద్ద విస్తరాకులో వడ్డించి తమ ప్రత్యేకతను చాటారు. సంక్రాంతి అంటే అందరూ కలవడం, సరదాగా గడపడం అని చాటి చెప్పారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం