Teachers Mlc Election : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బొర్రా గోపిమూర్తి ఘ‌న విజ‌యం-godavari district teachers mlc election pdf candidate borra gopi murthy won by 3906 votes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Teachers Mlc Election : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బొర్రా గోపిమూర్తి ఘ‌న విజ‌యం

Teachers Mlc Election : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బొర్రా గోపిమూర్తి ఘ‌న విజ‌యం

HT Telugu Desk HT Telugu
Dec 09, 2024 04:26 PM IST

Teachers Mlc Election : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎస్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి ఘన విజయం సాధించారు. బొర్రా గోపిమూర్తి త‌న స‌మీప అభ్యర్థి గంధం నారాయ‌ణ రావుపై 3,906 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బొర్రా గోపిమూర్తి ఘ‌న విజ‌యం
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బొర్రా గోపిమూర్తి ఘ‌న విజ‌యం

ఉమ్మడి ఉభ‌య గోదావ‌రి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బొర్రా గోపిమూర్తి ఘ‌న విజ‌యం సాధించారు. ఆయ‌న మొద‌టి ప్రాధాన్యత ఓట్లతో విజ‌యం సాధించారు. ఆయ‌న‌కు ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంక‌టేశ్వర‌రావు త‌దిత‌రులు అభినంద‌న‌లు తెలిపారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్లీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం న‌వంబ‌ర్ 4న ఉభ‌య గోదావ‌రి జిల్లాల ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల చేసింది. దీనికి సంబంధించిన పోలింగ్ డిసెంబ‌ర్ 5న జ‌రిగింది. ఉమ్మడి ఉభ‌యగోదావ‌రి జిల్లాల్లో మొత్తం 116 పోలీంగ్ కేంద్రాల్లో 16,737 ఓట్లకు గానూ, 15,494 (92.62 శాతం) ఓట్లు పోలైయ్యాయి.

yearly horoscope entry point

అభ్యర్థుల‌కు వ‌చ్చిన ఓట్లు

ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాకినాడ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్నాల‌జీ యూనివ‌ర్సిటీ (జేఎన్‌టీయూ)లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీలో జ‌రిగింది. 14 టేబుల్స్‌పైన తొమ్మిది రౌండ్లలో ఓట్లు లెక్కింపు ప్రక్రియ పూర్తి చేశారు. 15,494 ఓట్లకు గాను ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ బ‌ల‌ప‌రిచిన పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపిమూర్తి (9,165 ఓట్లు) త‌న స‌మీప అభ్యర్థి, ఎస్‌టీయూ బ‌ల‌ప‌రిచిన‌ గంధం నారాయ‌ణ రావు (5,259)పై 3,906 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇత‌ర అభ్యర్థులు పులుగు దీప‌క్‌కు 102, నామ‌న వెంక‌ట ల‌క్ష్మీకి 81, కావ‌ల నాగేశ్వ‌ర‌రావుకి 73 ఓట్లు వ‌చ్చాయి.

భారీగా చెల్లని ఓట్లు

ఈ ఎన్నిక‌ల్లో భారీగా చెల్లని ఓట్లు ప‌డ్డాయి. చెల్లని ఓట్లు 814 ప‌డ్డాయి. ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నిక‌ల్లో చెల్లని ఓట్లు భారీగా ప‌డ‌టంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా స‌రిగా ఓట్లు వేయ‌లేక‌పోతున్నార‌ని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మెజార్టీ పెంచుకున్న బొర్రా గోపిమూర్తి

2021లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపొందిన షేక్‌సాబ్జీ కంటే, ఇప్పుడు గెలుపొందిన బొర్రా గోపిమూర్తి మెజార్టీ ఎక్కువ‌గా న‌మోదు అయింది. ఆ ఎన్నిక‌ల్లో 17,467 ఓట్లకు 16,054 ఓట్లు పోలయ్యాయి. అందులో యూటీఎఫ్ త‌దిత‌ర సంఘాలు బ‌ల‌ప‌రిచిన‌ షేక్ సాబ్జీకి 7,987 ఓట్లు వ‌చ్చాయి. ఆయ‌న త‌న స‌మీప అభ్య‌ర్థి, వైసీపీతో పాటు, పీఆర్‌టీయూ మ‌ద్దతిచ్చిన‌ గంధం నారాయ‌ణ‌రావు (6,453 ఓట్లు)పై 1,534 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అప్పుడు టీడీపీ మ‌ద్దతు ఇచ్చిన అభ్యర్థి చెరుకూరి సుభాష్ చంద్రబోసుకు 106 ఓట్లు, బీజేపీ మ‌ద్ద‌తు ఇచ్చిన ఇళ్ల స‌త్యనారాయ‌ణ‌కు 300 ఓట్లు వ‌చ్చాయి. అప్పుడు 363 ఓట్లు చెల్ల‌ని న‌మోదు అయ్యాయి. ఈసారి ఓట్లు త‌గ్గిన‌ప్పటికీ మెజార్టీ పెరిగింది. మెజార్టీ 3,906 ఓట్లకు పెరిగింది. మ‌రోవైపు రెండుసార్లు ఓట‌మి చెందిన గంధం నారాయ‌ణరావుకు పోలైన‌ ఓట్ల సంఖ్య త‌గ్గింది.

ఎవ‌రీ గోపిమూర్తి...?

పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం నార్నిమెరక పంచాయతీలో గమల్లపేటలో సాధారణ వ్యవసాయ కుటుంబంలో గోపిమూర్తి 1975 ఏప్రిల్ 14న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనూ, హైస్కూలు చదువు మట్లపాలెం జడ్పి ఉన్నత పాఠశాలలోనూ చదివారు. భీమవరం డీఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ డిగ్రీ విద్యను పూర్తి చేశారు. ఏలూరు సీఆర్ కళాశాలలో ఉపాధ్యాయ విద్యను పూర్తిచేసి 1998 డీఎస్సీ ద్వారా సాధారణ టీచర్ వృత్తిని ప్రారంభించి ప్రస్తుతం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.

డీఎన్నార్ కళాశాలలో చదువుతున్న కాలం నుంచి ఈయన విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని విద్యార్థులు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన మొదటి రోజు నుంచి యుటిఎఫ్ లో సభ్యునిగా చేరి 1998 నుంచి ఇప్పటివరకు మండల,జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగిన అన్ని పోరాటాలలో పాల్గొన్నారు.

ఉద్యమాలే ఊపిరిగా...

ప్రధానంగా అప్రెంటిస్ వ్యవస్థ రద్దు కోసం, అప్రెంటీస్ కాలానికి రెండు నోసనల్ ఇంక్రిమెంట్లు సాధనకు జరిగిన అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా 2007 ఏప్రిల్‌లో పదో తరగతి స్పాట్ కేంద్రం వద్ద జరిగిన పోరాటంలో అరెస్టయి రెండున్నర సంవత్సరాలు కోర్టు కేసులో తిరిగారు. 2008లో జరిగిన సమ్మెలో చురుగ్గా పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు కోసం జరిగిన అన్ని పోరాటాల్లోను చురుకైన పాత్ర వహించారు. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ గా 2017 లో మాస్ క్యాజువల్ సందర్భంగా కలెక్టరేట్ చుట్టూ భారకేడ్లు, ఇనుపకంచెలు వేస్తే మొత్తం ఛేదించుకుని గోపిమూర్తి కలెక్టరేట్‌లో అడుగుపెట్టారు.

ఇదే సంవత్సరంలో సీపీఎస్ రద్దు కోసం మోటర్ సైకిల్ జాత సందర్భంగా ఇచ్ఛాపురం నుంచి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు వరకు సుమారు 1,700 కిలోమీటర్లు ఈ జాతాలో పాల్గొన్నారు. ఏలూరు నుంచి విజయవాడ వరకు జరిగిన పాదయాత్రలో కూడా పాత్ర వహించారు. పశ్చిమగోదావరి జిల్లా యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు అప్పటి డీఈవో, కలెక్టర్లపై పోరాటానికి అన్ని యూనియన్లను ఒక తాటిపైకి తీసుకువచ్చి పశ్చిమగోదావరి టీచర్స్ జేఏసీని ఏర్పాటు చేశారు.

అప్పటి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఉపాధ్యాయులను ఉద్దేశించి 'కదిలే శవాలు' అని వ్యాఖ్యానించినప్పుడు టీచర్స్ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద పోరాటం నిర్వహించారు. సాధారణ టీచర్‌గా జాయిన్ అయిన గోపిమూర్తి యూటీఎఫ్‌ పాలకోడేరు మండలం శాఖ అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, పశ్చిమగోదావరి జిల్లా మొద‌టి ఫ్యాప్టో చైర్మన్‌గా, రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర కోశాధికారిగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ జేఏసీ కో చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక, పెన్షనర్ల హక్కుల కోసం వారి సమస్యలు పరిష్కారం కోసం అనేక పోరాటాల్లో పాల్గొన్నారు.

ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలపై పోరాటం - గోపిమూర్తి

సంఘం నిర్ణయం మేరకు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశాన‌ని ఎమ్మెల్సీగా ఎన్నికైన గోపిమూర్తి తెలిపారు. సీపీఎస్ రద్దు కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంద‌నన్నారు. అన్ని రంగాల్లో వలె విద్యారంగంలో ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్, జెఎల్ ప్రమోషన్,అందరికీ హెల్త్ కార్డులు, ఐటీడీఏ పాఠశాలల్లో అప్ గ్రేడేషన్, జీవో నెంబ‌ర్ 3 అమలు, మున్సిపల్, ఎయిడెడ్ టీచర్ల సమస్యలు, ఎయిడెడ్ పాఠశాలల పోస్టుల భర్తీ, మోడల్ స్కూల్స్, కేజీబీవీ టీచర్ల సమస్యలు తదితర సమస్యల సాధనకై పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో కలిసి భవిష్యత్తులో పోరాటం చేస్తానని అన్నారు.

ఎమ్మెల్సీ సాబ్జీ మృతితో ఉపఎన్నిక‌

రాష్ట్రంలో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీగా ప్రొగ్ర‌సివ్ డ‌మోక్ర‌టిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) అభ్య‌ర్థి షేక్ సాబ్జీ 2021 మార్చి 30న గెలుపొందారు. ఆయ‌న ప‌ద‌వీకాలం 2027 మార్చి 29 వ‌ర‌కు ఉంది. అయితే 2023 డిసెంబ‌ర్ 15న ఏలూరులో అంగ‌న్ వాడీ స‌మ్మెలో పాల్గొని, అక్క‌డి నుంచి భీమ‌వ‌రం వెళ్తుండ‌గా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి మండ‌లం చెరుకువాడ స‌మీపంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. దీంతో ఉప ఎన్నిక జ‌రిగింది.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం