GIS MOUs : జీఐఎస్ ఒప్పందాలు కార్యరూపం దాల్చుతాయి... మంత్రి అమర్నాథ్-gis 2023 mous will be grounded soon says ap minister gudivada amarnath ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Gis 2023 Mous Will Be Grounded Soon Says Ap Minister Gudivada Amarnath

GIS MOUs : జీఐఎస్ ఒప్పందాలు కార్యరూపం దాల్చుతాయి... మంత్రి అమర్నాథ్

HT Telugu Desk HT Telugu
Mar 06, 2023 04:26 PM IST

GIS MOUs : గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా విశాఖ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని.. రానున్న రోజుల్లో ప్రపంచంలోని మేటి నగరాలతో విశాఖ పోటీ పడుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. గత మూడున్నరేళ్లలో కుదిరిన ఒప్పందాల్లో 89 శాతం గ్రౌండింగ్ అయ్యాయని... జీఐఎస్ సమ్మిట్ ఎంఓయూలు వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒప్పందాలపై ప్రతిపక్షాల విమర్శలను మంత్రి తిప్పికొట్టారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (facebook)

GIS MOUs : విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ - జీఐఎస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని.. పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు... రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. దాదాపు 352 ఎంఓయూలు, రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనకు విశాఖ వేదిక కావడం సంతోషకర విషయమన్నారు. ఇది రాష్ట్ర భవిష్యత్తు, యువత ఉపాధికి దోహద పడుతుందని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా మరింత బల పడుతుందని వివరించారు.

ట్రెండింగ్ వార్తలు

హైదరాబాద్ తో పోటీ పడగలిగే స్థాయి ఒక్క విశాఖ నగరానికే మాత్రమే ఉందన్నారు మంత్రి అమర్నాథ్. రాష్ట్రానికి సువిశాలమైన 974 కి.మీ తీర ప్రాంతం ఉందని... 48 ఖనిజ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని.... దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు ఉండగా, వాటిలో మూడు రాష్ట్రంలో ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆనుకుని ఉన్న ప్రధాన నగరాలైన.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలతో అనుసంధానం చేస్తూ.. పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేస్తున్నామని.... విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు , బెంగళూరు–హైదరాబాద్‌ కారిడార్ల డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నామని అన్నారు. ఆయా కారిడార్లలో పరిశ్రమల ఏర్పాటు కోసం 48 వేల ఎకరాలు సేకరించామని.. భూముల కేటాయింపునకు అన్ని సిద్ధం చేశామని చెప్పారు.

రాష్ట్రంలో పరిశ్రమలకు చాలా వేగంగా అనుమతులు ఇస్తున్నామని.. 23 శాఖలకు సంబంధించి వైయస్సార్‌ ఏపీ వన్‌ సింగిల్‌ క్లియరెన్స్‌ విండో ఏర్పాటు చేశామని చెప్పారు మంత్రి. 21 రోజుల్లోనే 96 అనుమతులు ఇచ్చేలా సింగిల్‌ విండో ఏర్పాటు చేశామన్నారు. భూముల కేటాయింపులు కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. సులభతర వాణిజ్యం (ఈఓబీ)లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్‌ వన్‌గా ఉందని.... 2021–22లో రూ.1.44 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు చేశామని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో పెట్టుబడుల కోసం 14 రంగాలను ఎంపిక చేసుకుని ఫోకస్‌ చేయాలని నిర్ణయించామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. ఫార్మా, ఐటీ సహా పలు రంగాల్లో ఏపీకి మంచి అవకాశాలు ఉన్నాయని వివరించారు. రొయ్యల ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 65 శాతం కాగా, మొత్తం చేపల ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 45 శాతంగా ఉందన్నారు. చాక్లెట తయారీలో వినియోగించే కొకొవా ఎగుమతిలో కూడా దేశంలోనే ఏపీ తొలి స్థానంలో ఉందన్నారు.

జీఐఎస్‌లో ఎంఓయూలపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయన్నారు మంత్రి అమర్నాథ్. గత మూడున్నర ఏళ్లుగా పలు పరిశ్రమలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయూల్లో 89 శాతం కార్యరూపం దాల్చాయన్నారు. అది తమ ప్రభుత్వ ఘనత- ట్రాక్‌ రికార్డు అని పేర్కొన్నారు. జీఐఎస్ ఎంఓయూలు కూడా తప్పనిసరిగా కార్యరూపం దాలుస్తాయని చెప్పారు. వచ్చే కొన్ని నెలల్లో, నెలకు కనీసం రెండు పరిశ్రమలు గ్రౌండ్‌ అయ్యే విధంగా చర్యలు చేపడతామని... పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని వివరించారు. జీఐఎస్‌పై దేశ వ్యాప్తంగా ఇప్పటికే చర్చ మొదలైందని చెప్పారు.

విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు.. మూడు నగరాలను ఐటీ కాన్సెప్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాలపైనా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ సదస్సు ద్వారా విశాఖకు బ్రాండ్‌ ఇమేజ్‌ ఏర్పడిందని..... ఇక్కడి వాతావరణం, అనుకూలమైన పరిస్థితులు, మౌలిక వసతులు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిశాయని పేర్కొన్నారు. విశాఖ రానున్న రోజుల్లో దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

IPL_Entry_Point

టాపిక్