Kakinada Crime : వివాహేతర సంబంధం..! ప్రియుడిని దారుణంగా హతమార్చిన ప్రియురాలు
కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ… ప్రియుడిని ఇనుప గొట్టంతో అతి దారుణంగా హతమార్చింది. నిందితురాలు పరారీలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రియురాలి చేతిలో ప్రియుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమైంది. కాకినాడ సిటీలోని టిడ్కో ఇళ్ల సముదాయంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రావులపాలేనికి చెందిన మునిస్వామి లావణ్యకు కొన్నేళ్ల క్రితం చిత్తూరుకు చెందిన బాలుతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మనస్పర్ధల కారణంగా ఇద్దరూ విడిపోయారు. నాలుగేళ్ల నుంచి లావణ్య రావులపాలెంలో ఉంటుంది. అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం చినమల్లానికి చెందిన గుడాల చంద్రశేఖర్ స్వామి (30) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
సహజీవనం….
పరిచయం కాస్తా ప్రేమగా మారి సహజీవనానికి దారితీసింది. వీరిద్దరి బంధం ఇలానే కొనసాగుతుండగా… రెండు నెలల క్రితం లావణ్యకు కాకినాడకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ లోవరాజుతో పరిచయం ఏర్పడింది. అతడి పరిచయంతో లావణ్య తన ప్రియుడు చంద్రశేఖర్ స్వామిని వదిలేసి లోవరాజుతో కాకినాడకు వచ్చింది. రెండు నెలల క్రితం లోవరాజు… తన ప్రియురాలి లావణ్యను కాకినాడ పట్టణంలోని స్వర్ణాంధ్రకాలనీలోని టిడ్కో గృహాల సముదాయంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంచాడు.
కాకినాడకు రావటంతో….
లావణ్య జాడ తెలియకపోవటంతో చంద్రశేఖర్ స్వామి వెతకసాగాడు. అయితే ఆమె కాకినాడలో ఉందని తెలుసుకుని వచ్చాడు. ఆమె అడ్రస్‌ను కనుక్కొని బుధవారం రాత్రి ఇంటికి వెళ్లాడు. హఠత్తుగా పాత ప్రియుడు కనిపించేసరికి లావణ్య కంగారు పడింది.
తన ప్రియురాలు వేరొక వ్యక్తితో ఉంటుందని చంద్రశేఖర్ తెలుసుకున్నాడు. దీంతో ఆమెను నిలదీశాడు. ఈ క్రమంలో ఇంట్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గురువారం తెల్లవారు జామున ఇంట్లో ఉన్న పప్పు గుద్దు, ఇనుప గొట్టంతో చంద్రశేఖర్ స్వామిపై లావణ్య దాడి చేసింది. తలపై బలంగా కొట్టేసరికి చంద్రశేఖర్ అక్కడికక్కడే కుప్పకులిపోయి మృతి చెందాడు. దీంతో లావణ్య రక్తపు మడుగులో ఉన్న ఆయనను వదిలేసి పరారయింది. అయితే మూడు నాలుగు గంటల తరువాత స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్ సీఐ సునీల్ కుమార్ స్పందిస్తూ… మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హత్యా ఘటనపై కేసు నమోదైనట్లు తెలిపారు.
హత్యకు వేరే వ్యక్తి సహకరించినట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసుల ఆరా తీస్తున్నారు. దర్యప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని, తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం