Nellore : ప్రేమించాలంటూ తొమ్మిదో తరగతి విద్యార్థినిని వేధించిన యువకుడు.. ఎలుకల మందు తాగిన బాలిక
Nellore : నెల్లూరు జిల్లాలో విషాదం జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలని విద్యార్థినిని ఓ యువకుడు వేధించాడు. పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాననంటూ బెదిరించాడు. వేధింపులు తాళలేక ఆ చిన్నారి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు రూరల్ మండలంలోని ఓ గ్రామంలో జాన్ అనే యువకుడు వరికోత యంత్రం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినిని అతను గత కొన్ని నెలలుగా వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థిని కనబడిన ప్రతీసారి ఇదే తంతు. ఇది తెలిసిన పెద్దలు జాన్‌ను పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఎటువంటి మార్పు రాలేదు.
అప్పటి వరకు వేధింపులకు పాల్పడిన జాన్, ఇటీవల బెదిరింపులకు దిగాడు. తననే పెళ్లి చేసుకోవాలని, లేదంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధిత బాలిక ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆమెను నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. బాలిక కుటుంబ సభ్యులు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై ఫిర్యాదు చేశారు.
ఉపాధ్యాయుడి లైంగిక దాడి..
ప్రకాశం జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆయనపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఈవో చంద్రమౌళి తెలిపారు. టంగుటూరు మండలంలోని ఒక గ్రామంలో ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం.. టంగుటూరు మండలంలోని ఒక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలిక నాలుగో తరగతి చదువుతోంది. గురువారం స్కూలుకు వెళ్లకుండా ఇంటివద్దే ఉండడంతో తల్లికి అనుమానం వచ్చింది.
బాలికను ఆరా తీసింది. ఏం జరిగింది, ఎందుకు స్కూల్‌కు వెళ్లలేదని తల్లి ప్రశ్నించింది. బాలిక జరిగిన విషయం తల్లికి చెప్పింది. తల్లి వెంటనే బాలికను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. బాలికను పరిశీలించి, స్థానికంగా వైద్యం చేయించారు. లైంగిక దాడి జరిగిందనే అనుమానంతో ఒంగోలు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యలు పరీక్షలు నిర్వహించి, బాలికపై లైంగిక దాడి జరిగిందని నిర్ధారించారు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడే ఈ దారుణానికి ఒడిగట్టారని గుర్తించారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు డిప్యూటీ డీఈవో చంద్రమౌళి తెలిపారు. దీనికి ఉపాధ్యాయుడు కారణమైతే అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
విజయనగరంలో..
విజయనగరంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి జైలు శిక్ష పడింది. పోక్సో కేసులో నేరారోపణ రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,500 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు.. విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
విజయనగరం పట్టణానికి చెందిన 15 ఏళ్ల బాలికను మంగలివీధికి చెందిన 26 ఏళ్ల కుమిలి సురేష్ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె ఇంటికి వెళ్లి తరచూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తమ కుమార్తెను నమ్మించి మోసం చేసినట్లు 2021లో బాలిక తల్లిదండ్రులు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును దిశ మహిళా పీఎస్ డీఎస్పీ టి.త్రినాథ్ దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి, కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ పూర్తయ్యే విధంగా మహిళా పీఎస్ సీఐ ఈ. నరసింహమూర్తి చర్యలు చేపట్టగా.. నిందితుడు సురేష్‌పై నేరం రుజువు కావడంతో విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కె.నాగమణి.. కుమిలి సురేష్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,500 జరిమానా విధించారు. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మావూరి శంకరరావు వాదనలు వినిపించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)