Indrakeeladri Dasara: ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి అజ్ఞాత భక్తుడి కానుక, రెండున్నర కోట్ల విలువైన కిరీటంతో అలంకారం
Indrakeeladri Dasara: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు అజ్ఞతా భక్తుడు కోట్లాది రుపాయల విలువైన కిరీటాన్ని బహుకరించాడు. దేవీ శరన్నవరాత్రులు సందర్భంగా అమ్మవారికి రెండున్నర కోట్ల రుపాయల ఖరీదు చేసే బంగారు కిరీటాన్ని అలంకరించారు. ఇంద్రకీలాద్రిపై బాలాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు.
Indrakeeladri Dasara: ఇంద్రకీలాద్రిపై జగన్మాత దేవీ శరన్నవరాత్రుల్లో తొలిరోజు బాలా త్రిపురసుందరీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బెజవాడలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఓ అజ్ఞాత భక్తుడు రెండున్నర కోట్ల రుపాయల ఖరీదు చేసే రత్నాలతో కూడిన స్వర్ణ కిరీటాన్ని బహుకరించాడు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని కొత్త కిరీటంతో అర్చకులు అలంకరించారు.
ఇంద్రకీలాద్రిపై గురువారం ఉదయం అశ్వయుజ శుద్ధపాడ్యమి ఘడియల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పార్థసారథి అమ్మవారికి పూజలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమైనట్టు మంత్రి ఆనం ప్రకటించారు.
భక్తుల దర్శనానికి సంబంధించి ఐదు క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, గతం కన్నా ఎక్కువ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల రద్దీ లేకుండా దర్శనాలు జరుగుతాయన్నారు. ప్రత్యేకంగా రెండు క్యూ లైన్లు సామాన్య భక్తులకు కోసం ఏర్పాటు చేసినట్టు వివరించారు.
9రోజుల పాటు జరిగే ఉత్సవాలు విజయవంతం కావాలని ఆ యొక్క దుర్గమ్మను కోరుకున్నట్టు తెలిపారు. లక్షలాది మంది భక్తులు కోట్లాది కుటుంబాలు నవరాత్రి ఉత్సవాలలో పాల్గొంటూ కనకదుర్గమ్మ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తారని, 100 రూపాయలు 300 రూపాయలు 500 రూపాయలు కింద మూడు లైన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు.
స్థలా భావం వల్ల ఇంద్రకీలాద్రిపై అందరి వాహనాల్ని పైకి తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రెవిన్యూ, పోలీస్ , ఎండోమెంట్ శాఖ అధికారులు అందరూ కలిసి సమన్వయంతో పున్నమి ఘాట్ వద్ద వాహనాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు.
ప్రతి ఒక్కరికి ప్రసాదాలు, అన్నప్రసాదాలు ఏర్పాటు చేశామని, గతం కన్నా ఎక్కువ సంఖ్యలో వచ్చిన ఎవరికీ కాదనకుండా అమ్మవారి ప్రసాదాల్ని అందించడానికి సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూలా నక్షత్రం రోజు తొమ్మిదో తారీఖు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటలు సమయంలో కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారని మంత్రి వివరించారు.
దసరా ఉత్సవాల సందర్భంగా కుటుంబ సమేతంగా హోంమంత్రి వంగలపూడి అనిత దుర్గమ్మను దర్శించుకున్నారు. హోంమంత్రి అనిత అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దర్శనానంతరం ఉత్సవాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడకుండా తీసుకున్న చర్యలు పై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రన్న పాలనలో చల్లగా ఉండాలని కోరుకున్నట్టు హోంమంత్రి తెలిపారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి దర్శనాంతరం వేద పండితులు హోం మంత్రి అనితకు ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈవో ఛైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రాలను ఆమెకు అందించారు.
దేవీ శరన్నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకరణలలో దర్శనమివ్వనున్న అమ్మవారిని మొదటి రోజున శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శించుకోవడం మహా భాగ్యమని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు.