GBS Cases In AP : ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు, ఈ అరుదైన వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయ్-gbs cases are increasing in ap here are the symptoms of this rare disease ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Gbs Cases In Ap : ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు, ఈ అరుదైన వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయ్

GBS Cases In AP : ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు, ఈ అరుదైన వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయ్

Bandaru Satyaprasad HT Telugu
Updated Feb 17, 2025 02:43 PM IST

GBS Cases In AP : ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి బారిన పడి ఓ వృద్ధురాలు గుంటూరు జీజీహెచ్ లో మృతి చెందింది. దీంతో పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అయితే జీబీఎస్ వ్యాధి లక్షణాలు, నివారణపై గురించి తెలుసుకుందాం.

ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు, ఈ అరుదైన వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయ్
ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు, ఈ అరుదైన వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయ్

GBS Cases In AP : ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్) కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం గుంటూరు జీజీహెచ్ లో కమలమ్మ అనే వృద్ధురాలు జీబీఎస్ వ్యాధి లక్షణాలతో మృతి చెందింది. ప్రభుత్వ లెక్కల ప్రకారంలో రాష్ట్రంలో 17 జీబీఎస్ కేసులు నమోదు అవ్వగా....అనధికారంగా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ప్రభుత్వం ప్రకటించింది. లక్షలో ఒకరికి వచ్చే ఈ వ్యాధి...ఇటీవల కాలంలో పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తాజా పరిస్థితిని పరిశీలిస్తుంది.

ఏపీలోని ఆరు జిల్లాల్లో జీబీఎస్ కేసులు నమోదయినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు, కాకినాడలో 4 కేసులు, గుంటూరు, విశాఖ జిల్లాలో 5 చొప్పున జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయి.

సీఎం చంద్రబాబు గులియన్-బారే సిండ్రోమ్ (GBS) పై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సత్య కుమార్ యాదవ్, సీనియర్ ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కేసుల తీవ్రత, వైద్య సదుపాయాలు, చికిత్సపై సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు.

గులియన్-బారే సిండ్రోమ్ అంటే ఏమిటి?

గులియన్-బారే సిండ్రోమ్ అనేది చాలా అరుదైన వ్యాధి. ఈ వ్యాధిలో రోగనిరోధక వ్యవస్థ నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. బాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ లేదా కొన్నిసార్లు టీకా వికటించి ఈ పరిస్థితికి దారితీస్తుంది. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దాని పరిధిలోని నరాలపై ఎటాక్ చేస్తుంది. ఈ పరిస్థితి బలహీనత, తిమ్మిరి, అవయవాలలో పక్షవాతం వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఇది సాధారణంగా ఫ్లూ లేదా కడుపు నొప్పి వంటి ఇన్ఫెక్షన్ తో మొదలవుతుంది. క్రమంగా తీవ్రమవుతుంది. క్రమంగా రోగి కదిలే సామర్థ్యాన్ని కోల్పోతాడు.

గులియన్-బారే సిండ్రోమ్ లక్షణాలు

జీబీఎస్ అనేక రకాల లక్షణాలను కలిగి ఉంటుంది. వీటిలో బలహీనత, తిమ్మరి వంటివి సాధారణ లక్షణాలు కాళ్లలో ప్రారంభమై చేతులు, ముఖానికి వ్యాపిస్తాయి. నడవడానికి ఇబ్బంది, కండరాల నొప్పి ఉంటాయి. వ్యాధి తీవ్రమైన సందర్భాల్లో పక్షవాతం కూడా రావొచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి. గంటలు లేదా రోజులలో వేగంగా తీవ్రమవుతాయి.

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం జీబీఎస్ లో కనిపించే మరిన్ని క్షణాలు

  • చేతి వేళ్లు, కాలి వేళ్లు, చీలమండలు లేదా మణికట్టులో సూదులతో గుచ్చిన అనుభూతి
  • కాళ్లలో బలహీనత, క్రమంలో శరీరం పైభాగానికి వ్యాపించడం
  • నడవడానికి లేదా మెట్లు ఎక్కడానికి ఇబ్బంది
  • మాట్లాడటం, నమలడం లేదా మింగడం వంటి ముఖ కదలికలతో సమస్యలు
  • దృష్టి సమస్యలు కళ్లు కదలలేకపోవడం
  • తీవ్రమైన నొప్పి, లేదా తిమ్మిరి లాంటి అనుభూతి, రాత్రిపూట తీవ్రమవుతుంది.
  • మూత్రాశయంలో సమస్యలు
  • హార్ట్ బీట్ హెచ్చుతగ్గుల వల్ల రక్తపోటు
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

జీబీఎస్ సోకిన వ్యక్తులు సాధారణంగా లక్షణాలు ప్రారంభమైన రెండు వారాలలోపు అత్యంత తీవ్రమైన బలహీనతను ఎదుర్కొంటారు.

గులియన్-బారే సిండ్రోమ్‌ నివారణ

జీబీఎస్ ను పూర్తిగా నివారించలేకపోయినా.. దానిని ప్రేరేపించే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. తరచుగా చేతులను కడుక్కోవడం, పరిశుభ్రతను పాటించడం, కలుషితమైన ఆహారం, నీటిని నివారించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల క్యాంపిలోబాక్టర్ వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. టీకా తీసుకున్నప్పుడు ఫ్లూ లేదా కడుపు సంబంధిత అనారోగ్యాలు ఎదురైతే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

బలహీనత, ఒళ్లు జలదరింపు లేదా నడవడానికి ఇబ్బంది వంటి జీబీఎస్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. తొలిదశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి చికిత్సలో ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ లేదా ప్లాస్మా ఎక్స్ఛేంజ్ ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థ నరాలను దెబ్బతీయకుండా నిరోధించడంలో సాయపడతాయి. వ్యాధి తీవ్రమైన సందర్భాల్లో, కోలుకోవడానికి శ్వాస మద్దతు లేదా శారీరక చికిత్స అవసరం అవుతుంది.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం