Garbage tax In Andhra : చెత్త పన్నుతో చిక్కులు.... బలవంతంపు వసూళ్లపై ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా చెత్త మీద పన్ను వసూలు చేసే విషయంలో ప్రభుత్వం వెనకాడటం లేదు. ముక్కుపిండి ప్రతి ఇంటి నుంచి చెత్త పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చెత్త సేకరణ కోసం నిర్దిష్ట రుసుము చెల్లించకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని హెచ్చరిస్తుండటంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇళ్ల నుంచి చెత్తను సేకరించడం, వాటిని డంపింగ్ యార్డులకు సేకరించడం పురపాలక సంస్థలకు పెద్దపనే. ఇన్నాళ్లు ఆస్తి పన్నులోనే చెత్త సేకరణ, నిర్వహణ కోసం కొంత కేటాయించేవారు. రకరకాల కారణాలతో చెత్తకు ప్రత్యేకంగా పన్ను వసూలు చేయడం ప్రారంభించారు. గత జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా పన్ను వసూలు చేయాలని నిర్ణయించారు. ప్రతి నెల వాలంటీర్లకు నిర్ణీత మొత్తాన్ని వసూలు చేయాలని ఆ డబ్బుతో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.
దీనిపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైనా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఆర్నెల్లుగా అయిష్టంగానో, బలవంతంగానో సాగుతున్న ఈ తంతు ఇటీవల బలవంతపు వసూలుగా మారింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకునే ప్రతి కుటుంబం వారు నివసించే ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.30 నుంచి రూ.120 వరకు చెత్త సేకరణ పన్ను చెల్లించాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా పన్ను చెల్లించడానికి నిరాకరిస్తే సంక్షేమ పథకాల్లో కోత విధిస్తామని హెచ్చరిస్తున్నారు. జనం బ్రతిమాలినా పట్టించుకోవడం లేదు.
చెత్తకు విలువ ఉంటుందా, చెత్తకు ధనికా, పేద భేదముంటుందా అని లాజిక్కులు అక్కర్లేదు. చెత్త సేకరణలో మాత్రం ఏపీ ప్రభుత్వం బాగా ఆలోచించి ప్రాంతాన్ని బట్టి చెత్త సేకరణ రేటు ఫిక్స్ చేసింది. పేదలు నివసించే ప్రాంతాల్లో కనీస ధర నెలకు రూ.30అయితే అదే అపార్ట్‌మెంట్‌లలో ఒక్కో ఫ్లాట్‌కు రూ.120 చొప్పున వసూలు చేస్తోంది. అపార్ట్‌మెంట్లలో కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేది ఏమి ఉండదు. ఎవరి చెత్తను వారే డస్ట్‌బిన్‌లలో పారేయడమో, పని మనుషులతో తరలించడమో చేస్తారని చెప్పినా సచివాలయ సిబ్బంది ఖాతరు చేయడం లేదు. ప్రతి అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తాఖీదులు అందిస్తున్నారు. ఆర్నెల్ల చెత్త బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు.
నివాస గృహాల సమస్య ఇలా ఉంటే వ్యాపార సంస్థలు, చిన్నాచితకా హోటళ్లు, రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకునే వారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటోంది. రోడ్లపై టీ బడ్డీలకు సైతం నెలకు రూ.150 చెత్త పన్ను వసూలు చేయాలని నిర్ణయించారు. ఇక పెద్ద హోటళ్లు, వాణిజ్య సంస్థలు, ఫంక్షన్ హాల్స్‌కైతే ఈ భారం భారీగానే ఉంటోంది. కార్పొరేషన్ సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి చెత్త డబ్బుల కోసం ఒత్తిడి చేస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లిస్తున్నా, ఈ అదనపు వసూళ్లు ఏమిటనే వారు కొందరైతే, ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర ఎందుకని ప్రశ్నించే వారు మరికొందరు.
స్లమ్, నాన్ స్లమ్ క్యాటగిరీల విభజన హేతుబద్దంగా లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి సచివాలయంలో ఉండే శానిటరీ కార్యదర్శికి పన్నులు చెల్లించాల్సి ఉన్నా, వాలంటీర్లే ఆ పని పూర్తి చేస్తున్నారు. జూన్ నెల సామాజిక పెన్షన్ల చెల్లింపులో భాగంగా ప్రజలకు పెన్షన్ ఇచ్చి పన్ను మొత్తాన్ని మినహాయించుకోవడం విజయవాడలో వెలుగు చూసింది. నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బలవంతంగా చెత్త పన్ను సేకరించాలని తాము చెప్పలేదని, ప్రజలకు అవగాహన కల్పించాలని మాత్రమే చెబుతున్నామని, పెన్షన్లలో మినహాయించుకోమని ఆదేశాలు ఇవ్వలేదని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.
టాపిక్