వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలంటూ గంటా జోస్యం
ఏపీ మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ఉంటాయని మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు జోస్యం చెప్పారు. మంత్రి పదవులు దక్కని వాళ్లు, వైసీపీలో ఇమడలేని వాళ్లు ఇప్పటికే చాలామంది ఉన్నారని వారంతా టీడీపీలోకి వచ్చేస్తారని మాజీ మంత్రి గంటా చెబుతున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన గంటా చాలా కాలంగా బయట కనిపించడం లేదు. అప్పుడప్పుడు కాపు నాయకులతో మంతనాలు మాత్రమే చేస్తూ లో ప్రొఫైల్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనా విశాఖ జిల్లా నేతల నుంచి వచ్చిన వ్యతిరేకతతో వైసీపీ వెనకడుగు వేయాల్సి వచ్చిందనే ప్రచారం కూడా ఉంది. గంటా రాకను అవంతి తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన టీడీపీలో కొనసాగాల్సి వచ్చిందని చెబుతారు. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ నేపథ‌్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలహీనమయ్యారని, రానున్న రోజుల్లో పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు టీడీపీలోకి వలస వస్తారని జోస్యం చెప్పారు. టీడీపీ అగ్రనేతలు పాదయాత్ర కానీ ప్రజా యాత్రతో కానీ ప్రజల్లోకి విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు.
సీనియర్ల నుంచి ముప్పట...
మంత్రి పదవులు కేటాయింపులో అన్యాయం జరగడంతో విజయవాడ, ప్రకాశం, అనకాపల్లి, గుంటూరులలో మొదట్నుంచి జగన్ వెంట నడిచిన వారు రగలిపోతున్నారని, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారని గంటా గుర్తు చేశారు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటకు వైసీపీలో ఎదురు లేదని, ఇకపై ఆ పరిస్థితి ఉండదన్నారు. ఇంత తీవ్ర స్థాయిలో నిరసనలు, రాజీనామా బెదిరింపులు, రాత్రిపూట ఆందోళనలు, జాతీయ రహదారుల దిగ్బంధనం గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. పార్టీ వర్గాల్లో సైతం జగన్ నిర్ణయాలపై వ్యతిరేకత ఉందని, దీని ప్రభావం మున్ముందు తీవ్రంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎనిమిది జిల్లాలకు మంత్రులే లేరని గంటా ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయకత్వంలో మంత్రి వర్గ కూర్పుపై ఒకరిద్దరు సీనియర్లు వ్యతిరేకత వ్యక్తం చేసినా ఎవరు ఆందోళనలు చేయలేదని వైసీపీ నేతలే రోడ్లెక్కి పోరాటాలు చేసేలా జగన్ మంత్రి వర్గ విస్తరణ ఉందన్నారు. రాజధానిగా ప్రకటించిన విశాఖ జిల్లాకు ఏం చేయలేకపోయారని, ప్రాంతాల వారీగా హేతుబద్దత లేదన్నారు. బీసీలకు పదవులు ఇచ్చామని చెప్పుకుంటున్నా, అధికారం లేని పదవులతో వారికి వచ్చే ప్రయోజనం ఏమటన్నారు.
జిల్లాల విభజన కూడా సరిగా జరగలేదని, ఆ పార్టీ నాయకులు, సీనియర్ మంత్రులే చెప్పులతో కొట్టుకున్నారని గుర్తు చేశారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షకు విద్యా శాఖ మంత్రి హాజరు కాలేదని గుర్తుచేశారు. టీడీపీలో ఉండగా పరీక్షల నిర్వహణకు ఖచ్చితమైన షెడ్యూల్ ఉండేదని, ఇప్పుడు ఏపీలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందని , పాఠశాల నిర్వహణ లోపభూయిష్టంగా మారిందన్నారు. జగన్‌పై ఆ పార్టీ నేతలే త్వరలో తిరగబడతారని, టీడీపీలోకి తరలి వస్తారన్నారు.
సంబంధిత కథనం
టాపిక్