Vijayawada Traffic Diversions : సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం- విజయవాడ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Vijayawada Traffic Diversions : సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపు గన్నవరంలో జరగనుంది. దీంతో విజయవాడ, గన్నవరం సమీప ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Vijayawada Traffic Diversions : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొనున్నారు. ఇప్పటికే పలువురు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి విశిష్ట అతిథిగా హాజరవుతున్నారు. కుటుంబంతో సహా చిరంజీవి హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నారు. దీంతో గన్నవరం విమానాశ్రయం పరిసరాలు సందడిగా మారాయి. వీఐపీలు వస్తుండడంతో గన్నవరం మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు వీవీఐపీలు, గవర్నర్, ముఖ్య నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశము ఉండడంతో విజయవాడ నుంచి గన్నవరం వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. ఈ మేరకు ఎన్డీఆర్ జిల్లా పోలీసులు ప్రకటన చేశారు.
విజయవాడలో వాహనాల మళ్లింపు
విజయవాడ నుంచి ఏలూరు, విశాఖపట్నం వైపునకు వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలను ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బెంజ్ సర్కిలు నుంచి కంకిపాడు-పామర్రు-హనుమాన్ జంక్షన్-ఏలూరు వైపునకు మళ్లిస్తారు.
వియవాడ వెలుపల ట్రాన్స్ పోర్టు వాహనాల మళ్లింపు
- విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపునకు వచ్చే వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి నూజివీడు, జి. కొండూరు, ఇబ్రహీంపట్నం ఇరువైపుల మళ్లింపు
- విశాఖపట్నం నుంచి చెన్నై వైపునకు వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనుముడి వారధి, రేపల్లె, బాపట్ల, త్రోవగుంట ఒంగోలు మీదుగా మళ్లిస్తారు.
- చెన్నై నుంచి విశాఖపట్నం వైపునకు వెళ్లే వాహనాలను ఒంగోలు, త్రోవగుంట, బాపట్ల, రేపల్లె, పెనుముడి వారధి, అవనిగడ్డ, పామర్రు , గుడివాడ, హనుమాన్ జంక్షన్ వైపు
- చెన్నై నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్లే వాహనాలను మేదరపెట్ల, అద్దంకి, నరసరావుపేట, పిడుగురాళ్ల, మిర్యాలగూడెం, నల్గొండ నుంచి వెళ్లాలి.
- హైదరాబాద్ నుంచి గుంటూరు వైపునకు వెళ్లే వాహనాలు నల్గొండ, మిర్యాలగూడెం, దాచేపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట, అద్దంకి, మేదరమెట్ల నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
ఆర్టీసీ బస్సులు మళ్లింపు
విజయవాడ ఏలూరు వైపునకు వెళ్లే బస్సులు విజయవాడ బస్ స్టేషన్ నుంచి ఓల్డ్ PCR జంక్షన్, ఏలూరు రోడ్, హోటల్ స్వర్ణ పాలెస్, చుట్టుగుంట, గుణదల, రామవరప్పాడు రింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, నున్న బైపాస్, నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు వైపు మార్గంలో వెళ్లాలి.
విజయవాడ రామవరప్పాడు రింగ్ నుంచి గన్నవరం వైపునకు ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి వెళ్లే వాహనాలు, అంబుల్లెన్లు , అత్యవసర ఆరోగ్య చికిత్స వాహనాలు తప్ప మరి ఏ ఇతర వాహనాలను గన్నవరం వైపునకు అనుమతించరు. పాసులు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ట్రాఫిక్ మళ్లిoపునకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.
పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి
విజయవాడ, ఇతర ప్రదేశాల నుంచి గన్నవరం ప్రమాణస్వీకార ప్రాంతానికి పాసులు ఉన్న బస్సులు/కార్లను మాత్రమే అనమతిస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ ప్రకటించారు. పాసులు లేని ఇతర వాహనాలు అనుమతిలేదని స్పష్టంచేశారు.
9 ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు
విజయవాడలో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, అంబేడ్కర్ విగ్రహం వద్ద, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, లెనిన్ సెంటర్, పటమటలోని జెడ్.పి.బాయ్స్ హై స్కూల్, అజిత్ సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం, జింకానా గ్రౌండ్స్ , విధ్యధరపురం మినీ స్టేడియం ప్రాంతాలలో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రామాన్ని ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
ఇతర రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, వీవీఐపీలు, వీఐపీలు, ప్రముఖులు గన్నవరం మార్గంలో ప్రయాణం చేస్తారు కాబట్టి ట్రాఫిక్ పరంగా భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన బందోబస్త్ ఏర్పాట్లు చేశామని కమిషనర్ తెలిపారు. పాసులు కలిగిన ఆహ్వానితులు సభా స్థలానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు.
సంబంధిత కథనం