Gangavaram Port: గంగవరం పోర్టు ముట్టడికి నిర్వాసితుల ప్రయత్నం.. ఉద్రిక్తత
Gangavaram Port: విశాఖపట్నం గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ‌్వర్యంలో పోర్టు ముట్టడికి పిలుపునిచ్చారు. ఆందోళన కారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
Gangavaram Port: విశాఖపట్నం గంగవరం పోర్ట్ దగ్గర కార్మికులు, నిర్వాసితుల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోర్టు ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోర్టు ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. పరిసర ప్రాంతాల్లో మూడంచెల్లో కంచె ఏర్పాటు చేశారు. గంగవరం పోర్టు వద్దకు వెళ్ళకుండా ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో పోర్టు వద్దకు చేరుకున్న నిర్వాసితలు, కార్మికులు గంగవరం పోర్టు ముట్టడికి యత్నించారు. పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్న కార్మికులు.. కంచె, బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు యత్నం చేశారు. ఈ క్రమంలో కార్మికులను నిలువరిచేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులు, కార్మికులు, నిర్వాసితుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
కార్మికులు చేపట్టిన 'పోర్టు బంద్' ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. గురువారం ఉదయం పెద్ద ఎత్తున కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నేతలు గంగవరం పోర్టు వద్దకు చేరుకున్నారు.
పోలీసులను తోసుకుంటూ పోర్టులోకి వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొది. తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు గంగవరం పోర్టు ముట్టడికి పిలుపునిచ్చిన కార్మికులకు పలు రాజకీయ పార్టీలు, ప్రజసంఘాలు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నాయి.
గంగవరం పోర్టు ముట్టడికి నిర్వాసితులు వారం క్రితమే పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధన కోసం కాంట్రాక్టు కార్మికులు, నిర్వాసితులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆందోళనకారుల్ని అడ్డుకోవడానికి పోలీసులు పోర్టు ప్రాంతంలో కంచెలు ఏర్పాటు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నిర్వాసితులు, కాంట్రాక్టు కార్మికులు 45రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. కార్మికుల వేతనాలను 12వేల నుంచి 22వేలకు పెంచాలని కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. దీంతో పాటు నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. జెట్టీ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.