Amaravati Assigned Lands : మరోసారి తెరపైకి అమరావతి అసైన్డ్ భూముల కేసు - సీఐడీ చేతికి కొత్త ఆధారాలు! ఏం జరగబోతుంది..?
Amaravati Assigdned Lands Scam: అమరావతి అసైన్డ్ భూముల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలు ఆధారాలను సేకరించిన సీఐడీ… ఏపీ హైకోర్టులో కొత్తగా రెండు పిటిషన్లను దాఖలు చేసింది.
Amaravati Assigned Lands Scam: టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తోంది ఏపీ సీఐడీ. ఇప్పటికే పలు కేసుల్లో వరుసగా పీటీ వారెంట్లు దాఖలు చేస్తుండగా… ఇప్పుడు కొత్తగా అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ కేసులో సరికొత్త ఆధారాలు లభించటంతో… సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూముల కేసులో కొత్త రెండు పిటిషన్లను దాఖలు చేయటం కీలక పరిణామంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం అసైన్డ్ భూములను భారీగా సేకరించింది. ఇందులో భారీగా అక్రమాలు జరిగాయంటూ…. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ ప్రారంభించింది సీఐడీ. ఈ కేసులో ప్రధానంగా… అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రిగా పని చేసిన నారాయమపై అభియోగాలు ఉన్నాయి. సీఐడీ విచారణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు… మార్చి 19న హైకోర్టు స్టే విధించింది. మరోవైపు కేసును కొట్టేయాలంటూ చంద్రబాబుతో పాటు నారాయణ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే దాదాపు వాదనలు ముగిశాయి. అక్టోబర్ 16న తేదీన తీర్పు రాబోతుంది. తీర్పు వచ్చే క్రమంలో సీఐడీ తాజాగా కొత్తగా రెండు పిటిషన్ దాఖలు చేసింది.
సీఐడీ చేతికి ఆధారాలు..?
ఈ కేసుకు సంబంధించి సీఐడీకి మాజీ మంత్రి నారాయణ మరదలు పొంగూరు కృష్ణప్రియ కొన్ని ఆడియో, వీడియో ఆధారాలు అందజేశారని తెలుస్తోంది. ఇందులో నారాయణ, తదితరులు ఏ విధంగా భూములు కొనుగోలు చేశారు..? అనే విషయాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల మేరకు సమాచారం. అయితే సీఐడీ కొత్తగా పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో… హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఉత్కంఠగా మారింది.
సీబీఐ చేతికి స్కిల్ స్కామ్ కేసు…?
స్కిల్ స్కామ్ కేసులో మరిన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు సీబీఐకి ఇచ్చేందుకు రంగం సిద్దమవుతోంది. ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఉండవల్లి వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సిబిఐ దర్యాప్తునకు అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఈ నేపథ్యంలో… కేసును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. సీబీఐ దర్యాప్తు కోరుతూ నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాలను ఏపీ సర్కార్ కోరే అవకాశం ఉంది.